నృసింహునికి పానకాభిషేకం | - | Sakshi
Sakshi News home page

నృసింహునికి పానకాభిషేకం

Jun 17 2026 5:03 AM | Updated on Jun 17 2026 5:03 AM

కోలారు: ముళబాగిలు తాలూకాలోని కదరిపుర గ్రామంలో సుప్రసిద్ద కంబద శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో నిజ జేష్ట మాసం మొదటి మంగళవారం సందర్భంగా విశేష పూజలు జరిపించారు. మూల విరాట్టుకు పానక అభిషేకం, పంచామృత అభిషేకం, అలంకారం, పూజలు సాగించారు. పెద్దసంఖ్యలో భక్తులు నృసింహున్ని దర్శించుకుని పావనులయ్యారు. గాయకుల భక్తి గాన కచేరీ ముగ్ధుల్ని చేసింది.

బిడది టౌన్‌షిప్‌

అవసరం: మంత్రి

మైసూరు: బిడది టౌన్‌షిప్‌ ఏర్పాటుపై జేడీఎస్‌ రాజకీయాలు చేస్తోందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి యతీంద్ర సిద్దరామయ్య ఆరోపించారు. మంగళవారం మైసూరులో విలేకరులతో మాట్లాడుతూ, బిడది టౌన్‌షిప్‌కు 80 శాతం మంది రైతులు భూమి ఇవ్వడానికి అంగీకరించారని, మరికొందరు ఎక్కువ పరిహారానికి ఒప్పుకున్నారని తెలిపారు. కొంతమంది మాత్రమే వ్యతిరేకించారన్నారు. వారి కోసం ప్రాజెక్టును వదులుకోలేమని ఆయన చెప్పారు. ‘బెంగళూరులో జనాభా పెరిగింది. చాలా మందికి స్థలాలు అవసరం. బెంగళూరు జనాభాను వికేంద్రీకరించాలి. బెంగళూరును విస్తరించడం కోసం టౌన్‌షిప్‌ కావాలి. మేము రైతులతో మాట్లాడి ఒక ప్రణాళికను రూపొందిస్తాము’ అని తెలిపారు. బిడది రిసార్ట్‌లో సీఎల్పీ భేటీ, ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహనకు హాజరవుతానని తెలిపారు.

బాలలకు పాదరక్షల పంపిణీ

మండ్య: తాలూకాలోని తుంబకెరెలోని సంచార జాతుల బడి పిల్లలకు తుమకూరుకు చెందిన త్రివర్ణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో షూ, చెప్పులను పంపిణీ చేశారు. ధనవంతులందరికీ పేదలకు సాయం చేయాలనే గుణం ఉండదన్నారు. అయితే దాతలు పీ.గోపాల్‌, కుమార్‌ల దానగుణం ప్రశంసనీయమని అందరూ అభినందించారు. లెక్చరర్‌ కల్లహళ్లి కేసీ లోకేష్‌, రిటైర్డ్‌ హెచ్‌ఎం మంచశెట్టరు, దేవరాజ్‌ కొప్ప , శృతి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర బీజేపీ సారథిగా

ప్రహ్లాద్‌ జోషి?

దొడ్డబళ్లాపురం: రాష్ట్ర బీజేపీకి నూతన అధ్యక్షున్ని ఎంపిక చేసేందుకు హైకమాండ్‌ ప్రయత్నాలు చేస్తోంది. కొత్త అధ్యక్షునిగా సీనియర్‌ నాయకుడు, కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషిని నియమించనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. జోషి 2014 నుంచి రెండేళ్ల పాటు రాష్ట్ర బీజేపీ సారథిగా పనిచేశారు. నూతన సీఎంగా డీకే శివకుమార్‌ అయ్యాక రాష్ట్రంలో బీజేపీ రాజకీయ లెక్కలు మారాయి. కేంద్ర మంత్రివర్గంలో త్వరలో మార్పులు చేసుకోనున్నట్టు తెలుస్తోంది. కొందరిని తప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. జోషిని కూడా తప్పించి రాష్ట్ర పగ్గాలు ఇవ్వవచ్చని ప్రచారం సాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు విజయేంద్ర రెండేళ్లుగా తాత్కాలిక చీఫ్‌గా కొనసాగుతున్నారు. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన నేతగా జోషి పేరును ప్రకటించే చాన్సుంది.

బయటపడ్డ బసవేశ్వరాలయం

అడుగంటిన కబిని

మైసూరు: వర్షాలు లేక కబిని (కపిలా) నది ప్రవాహం క్షీణించింది. జిల్లాలోని హెచ్‌డీ కోటె తాలూకా బీచనహళ్లి సమీపంలోని కబిని జలాశయంలో నీరు అడుగంటి పోవడంతో ప్రాచీన బసవేశ్వరాలయం బయట పడింది. 2013, 2016లో కూడా ఇలానే ఎండిపోవడంతో ఆలయం గోచరించింది. ఈసారి రాష్ట్రంలో తీవ్ర కరువు, కాటకాలు సంభవించవచ్చన్న చర్చల నడుమ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం ఆయకట్టు రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. డ్యాం అడుగంటడంతో బ్యాక్‌వాటర్‌లోని ఆలయ రాతి మంటపాలు కనిపిస్తున్నాయి. స్థానికుల కథనం మేరకు 10 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందన్నారు. 2013లో కూడా మాంకాళమ్మ, భవానీ శంకర్‌ ఆలయాలు బయటపడ్డాయన్నారు. ఈ రెండు ఆలయాలు ఉన్న ఊరు కిత్తూరు, జలాశయం పోటు జలాల్లో మునిగిందన్న చారిత్రక అంశం వెలుగులోకి వచ్చిందన్నారు. బసవేశ్వరాలయంలో భక్తులు పూజలు చేసి కరువు కాటకాలు రాకుండా చూడాలని మొక్కుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement