బళ్లారిటౌన్: పని చేసే స్థలాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నియంత్రణ, సురక్షిత వాతావరణం కోసం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదు సమితిని ఏర్పాటు చేయాలని జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్ ఆదేశించారు. ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ మహిళలు ఉద్యోగ వేళల్లో లైంగిక వేధింపుల నియంత్రణ నిషేధ, పరిహార చట్టం–2013 ప్రకారం పది మంది కన్నా ఎక్కువ సిబ్బంది ఉన్న ప్రతి ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలు, మండలి, నిగమ, స్థానిక సంస్థలు, ప్రైవేట్ సంస్థల్లో ఈ సమితులను తప్పకుండా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో పలు కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ఫ్యాక్టరీలు, వ్యాపార కాంప్లెక్స్‌లు, గార్మెంట్ సంస్థలు, బ్యాంకుల్లో కూడా తప్పనిసరి అన్నారు. 12 రోజుల్లోగా అన్ని శాఖల అధికారులు తమ పరిధిలో అంతర్గత ఫిర్యాదు సమితిని ఏర్పాటు చేయాలన్నారు. అందులో సభ్యుల వివరాలను వార్షిక నివేదికను భర్తీ చేసి జిల్లా మహిళ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ డీడీ కార్యాలయానికి సమర్పించాలన్నారు. ఒక వేళ ఈ ఆదేశాలను పాటించకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళా సిబ్బంది ఫిర్యాదు సమర్పించేందుకు తగిన వేదిక లేని కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని, మహిళలకు సమస్యలు ఉద్భవిస్తే ఆయా కార్యాలయ బాధ్యులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.


