బనశంకరి: హైకమాండ్ పై విశ్వాసం ఉంది, అవకాశం ఇస్తే మరో రెండు బడ్జెట్‌లు ప్రవేశపెడతానని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తననే సీఎంగా కొనసాగించాలని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, డీసీఎం డీకే శివకుమార్ ఆకస్మాత్తుగా ఢిల్లీకి బయల్దేరడం కుతూహలం రేకెత్తిస్తోంది. కలబుర్గి జిల్లా చిత్తాపుర నియోజకవర్గంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కలిసి ఆయన వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. తరువాత అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో ఖర్గేతో కలిసి ఢిల్లీకి వెళ్లారు.
బడ్జెట్ అయిపోయింది కదా...
గత డిసెంబరు నుంచి శివకుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం అధిష్టాన్ని పట్టుబడుతున్నారు. బడ్జెట్‌ను కూడా తానే సమర్పిస్తానని ఒత్తిడి చేశారు. కానీ హైకమాండ్ అవకాశం ఇవ్వలేదు. యథావిధిగా సీఎం సిద్దరామయ్య బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎక్కువ బడ్జెట్‌లు సమర్పించిన సీఎంగా సిద్దరామయ్య పేరు గడించారని, ఇకనైనా కుర్చీని వదిలిపెట్టాలనే నినాదంతో డీకే ఢిల్లీకి తరలినట్లు భావిస్తున్నారు. హైకమాండ్ చెబితే పదవిని వదులుకుంటానని సిద్దరామయ్య పదేపదే చెబుతుండడం తెలిసిందే. ఢిల్లీ యాత్రలో ఏం జరుగుతుందోనని అందరిలో ఉత్కంఠ ఏర్పడింది. అయితే ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళుతున్నట్లు డీకే ఆఫీసు వర్గాలు తెలిపాయి.
ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో కలిసి ఢిల్లీకి డీకేశి
సీఎం సీటు కోసం ఒత్తిడి పెంచడానికేనా!
ఖర్గే ద్వారా ప్రయత్నాలు
ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సన్నిహితంగా ఉంటున్న డీకే శివకుమార్ తన మనోరథం నెరవేర్చుకునే పనిలో ఉన్నారు. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు పూర్తయ్యేవరకూ ఓర్పుగా ఉండాలని పార్టీ పెద్దలు సూచించగా, డీకే సమ్మతించడం లేదని తెలిసింది. తనకు సీఎం సీటును ఇవ్వని పక్షంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది తప్పదని హెచ్చరించారు. అలాగే బెంగళూరులో 5 కార్పొరేషన్ల ఎన్నికలు, జిల్లా పంచాయతీలు, తాలూకా పంచాయతీల ఎన్నికలు కూడా రాబోతున్నాయి, వీటిలో గెలవాలంటే తన డిమాండు తీర్చాలని హైకమాండ్‌పై ఆయన ఒత్తిడి పెంచుతున్నట్లు వినికిడి. డీకేకు పదవికి ప్రియాంకగాంధీ సుముఖంగా ఉన్నా, రాహుల్‌గాంధీ ఆమోదించడం లేదని సమాచారం.


