విద్యార్థులకు కంప్యూటర్ జ్ఞానం అత్యవసరం
హొసపేటె: నేటి ఆధునిక పరిజ్ఞాన యుగంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. శనివారం విజయనగర జిల్లా హొసపేటెలో సియెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ పీయూ బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) తరగతులను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎస్‌టీఈఎం, రోబోటిక్స్, కోడింగ్, డిజిటల్ ఇన్నోవేషన్‌లో అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. సియెంట్ లిమిటెడ్ అధినేత డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వ విద్యాశాఖ సహకారంతో అమలు చేసిన ఈ ప్రాజెక్టును ఈరోజు భారత ప్రభుత్వ ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రారంభించడం గర్వకారణమన్నారు. కర్ణాటకలో మొట్టమొదటి హొసపేటె తాలూకాలోని ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న ఈ పైలెట్ ప్రాజెక్ట్‌లో 6 నుంచి 10వ తరగతి వరకు చదివే 2000 మందికి పైగా విద్యార్థులకు ఐటీ సాధికారత కల్పిస్తుందన్నారు. ఎమ్మెల్యే గవియప్ప, జిల్లాధికారి కవిత తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్


