రూ.వెయ్యి కోట్ల సైబర్ నేరాల ముఠా
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలోనే అతిపెద్ద సైబర్ క్రైం కేసును దావణగెరె పోలీసులు ఛేదించారు. సుమారు రూ.1000 కోట్ల మేరకు ఈ సైబర్ నేరస్తులు దోచుకున్నట్టు భావిస్తున్నారు. అర్ఫాత్, సంజయ్ కుంద్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
ప్రమోద్ ఫిర్యాదుతో..
గత రెండు నెలల క్రితం ప్రమోద్ అనే వ్యక్తి ఖాతా నుంచి రూ.52 లక్షలు పోయాయని దావణగెరె సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు ప్రమోద్ ఖాతా నుంచి రూ.150 కోట్ల లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. అయితే ఇంకా లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు సైబర్ క్రైంలో ఇతడూ భాగస్వామి అని తేలింది. అతని ఖాతాలోకి అపరిచిత అకౌంట్ల నుంచి కోట్ల రూపాయలు వచ్చేవి. అతనిని ప్రశ్నించగా, వ్యాపారవేత్తనంటూ బ్యాంకుల్లో కరెంట్ ఖాతాలను తెరిచి వాటిని సైబర్ నేరస్తులకు ఇచ్చేవాడు. నేరగాళ్లు తాము కొట్టేసిన సొమ్ములను ఈ ఖాతాల్లో నిల్వ ఉంచేవారు. ఇందుకుగాను ప్రమోద్‌కు కమీషన్ ఇచ్చేవారు. గ్యాంబ్లింగ్, ఫేక్ ట్రేడింగ్, ఆన్‌లైన్ గేమింగ్ తదితర అక్రమ దందాల ద్వారా వచ్చే డబ్బు జమ ఇతని ఖాతాల్లో అయ్యేది.
అర్ఫాత్ ఖాతాలో రూ.18 కోట్లు
ఈ కేసులో అర్ఫాత్ అనే వంచకున్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇతని బ్యాంక్ అకౌంట్లో కూడా రూ.18 కోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో నిందితుడు సంజయ్ కుంద్‌ను గుజరాత్‌లో పట్టుకున్నారు. ఈ ముఠాలో చాలా మంది ఉన్నట్లు, సుమారు రూ. వెయ్యి కోట్ల మేర అక్రమాలు జరిగాయని తేల్చారు. ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది.
ఛేదించిన దావణగెరె పోలీసులు
బ్యాంకు ఖాతాదారు ద్వారా కదిలిన డొంక


