పోలియో రహిత దేశానికి టీకా తప్పనిసరి
హొసపేటె: దేశాన్ని పూర్తిగా పోలియో రహితంగా మార్చాలంటే ప్రజలు సమీపంలోని పోలియో చుక్కల కేంద్రాలకు వెళ్లి ఐదేళ్ల లోపు వయస్సు ఉన్న తమ పిల్లలకు చుక్కలు వేయించాలని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్ ఎల్‌ఆర్ శంకర్ నాయక్ అన్నారు. మాతా శిశు ఆస్పత్రి ఆవరణలో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో అవగాహన జాతాను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈసారి ఈనెల 21 నుండి 24 వరకు వివిధ విభాగాల సమన్వయంతో నిర్వహించే జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తప్పనిసరి టీకాను వేయించుకోవాలన్నారు. అనంతరం నగర వీధుల్లో ప్రధాన సర్కిళ్ల గుండా మాతాశిశు ఆస్పత్రి ప్రాంగణం వరకు జాతా సాగింది. 200 మందికి పైగా విద్యార్థులు, ఆశా వర్కర్లు పోలియోకు సంబంధించిన వివిధ నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. జిల్లా ఆర్‌సీహెచ్ అధికారి డాక్టర్ జంబయ్య, జిల్లా కుష్టు వ్యాధి నిర్మూలన అధికారి డాక్టర్ కే.రాధిక, జిల్లా సర్వే అధికారి డాక్టర్ షణ్ముఖ, తాలూకా వైద్యాధికారి డాక్టర్ వినోద్, బాలల అభివృద్ధి ప్రాజెక్టు అధికారి సింధు అంగడి, ఐఎంఏ అధ్యక్షుడు రఘునాథ్ దీపాలి, పిల్లల వైద్యురాలు లలితా జైన్, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


