కలబుర్గిపై డిజిటల్ నేరగాళ్ల కన్ను
దొడ్డబళ్లాపురం: డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయకుల నుంచి కోట్ల రూపాయలను దోచేస్తున్నారు. కలబుర్గి పోలీసులు నేరగాళ్లను అరెస్టు చేసి రూ.2.73 కోట్లు రికవరీ చేసినట్టు ఆ నగర పోలీస్ కమిషనర్ శరణప్ప ఎస్‌డీ తెలిపారు. వివరాలు.. కలబుర్గి దంపతులకు ఇటీవల వాట్సాప్‌లో ఓ మేసేజ్ వచ్చింది. డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. కోర్టు సెట్టింగు వేసి మరీ వీడియో కాల్‌లో రోజూ ఆన్‌లైన్ విచారణ పేరిట సతాయించారు. 25 రోజులపాటు ఈ విచారణ కొనసాగింది. చివరకు వారి నుండి రూ.1.26 కోట్లు వసూలు చేశారు. తరువాత బాధితులకు తాము సైబర్ నేరస్తుల వలలో పడ్డట్టు అర్థమయింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఇదేమాదిరిగా మరో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి మహమ్మద్ అలీని సైబర్ నేరస్తులు బెదిరించి రూ.96 లక్షలను వసూలు చేశారు.
40 నేరాల ఛేదన
కలబుర్గి పోలీసులు దుండగుల ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల ఆధారంగా విచారణ జరిపారు. సుమారు 40పైగా సైబర్ నేరాలతో సంబంధమున్న నేరగాళ్లను అరెస్టు చేసి రూ.2.73 కోట్లు రికవరీ చేశారు. ఆ డబ్బును బాధితుల అకౌంట్లలోకి బదిలీ చేసినట్లు కమిషనర్ తెలిపారు.
భారీగా మోసాలు, దోపిడీలు
పలు కేసుల్లో రూ.2.73 కోట్ల రికవరీ
అధికమైన ఆన్‌లైన్ నేరాలు
బెంగళూరు, మైసూరు తరువాత కలబుర్గి జిల్లాలో సైబర్ మోసాల బాధితులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు.
2023లో 1,029 కేసులు నమోదు కాగా రూ.6.16 కోట్ల మేరకు దోచుకున్నారు. అందులో రూ.17.16 లక్షలు మాత్రమే రికవరీ అయ్యాయి.
2024లో 1,592 కేసులు నమోదు కాగా రూ.18.87 కోట్ల మోసం జరిగింది.అందులో రూ.34.85 లక్షలను రికవరీ చేశారు.
2025లో 2,275 సైబర్ నేరాలు జరగ్గా, రూ.21.86 కోట్లను దోచేశారు. అందులో రూ.2.73 కోట్లను మాత్రం స్వాధీనం చేసుకున్నారు.
అత్యధికంగా విద్యావంతులు, ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, ఉద్యోగులే మోసపోవడం గమనార్హం.
కలబుర్గిపై డిజిటల్ నేరగాళ్ల కన్ను


