వేణుగోపాలునికి ధనుర్మాస పూజలు
కోలారు: నగరంలోని కిలారి పేటలో ఉన్న వేణుగోపాల స్వామి ధనుర్మాస పూజలను తెల్లవారుజామునే భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారు 3 గంటల నుంచి తీవ్రమైన చలిలోను భక్త భజన బృందం సభ్యులు నగర వీధులలో తిరిగి భజనలు చేశారు. ఈ భజనలు సంక్రాంతి వరకూ కొనసాగుతాయి. అర్చకుడు రఘుశర్మ నేతృత్వంలో పూజలను నిర్వర్తించారు. వేణుగోపాల స్వామి వారిని అభిషేకించి విశేష పూలతో అలంకరించారు. వేకువ నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు.
21న సేవా కార్యక్రమాలు
● వైఎస్సార్‌సీపీ ఐటీ వింగ్
బనశంకరి: వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఐటీ వింగ్– బెంగళూరు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. నవరత్నాలు పథకాలతో అన్నివర్గాల సంక్షేమానికి పాటుపడిన మహోన్నత నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాల సాధన కోసం జగనన్న అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం మనందరిపై ఉందని ఐటీ వింగ్ నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్యం, విద్యకు ప్రాధాన్యత ఇస్తూ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం, నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసిన ఘనత జగనన్నకు దక్కుతుందన్నారు. మన ప్రియతమ నేత జగనన్న పుట్టినరోజు డిసెంబరు 21 తేదీ కాగా, ఆరోజు సాయంత్రం 6 గంటలకు కృష్ణరాజపురం శబరి ఆశ్రయధామ, బెళతూరులో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని మనవి చేశారు. మరిన్ని వివరాలకు– 9035193106, 9703518965 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
గజ దాడి, బైకిస్టు మృతి
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని మలే మహదేశ్వర అభయారణ్యంలో జల్లిపాళ్య సమీపంలో అడవి ఏనుగుల దాడిలో ద్విచక్రవాహనదారు చనిపోయాడు. మృతుడిని శివమూర్తిగా గుర్తించారు. ఆయన జల్లిపాళ్య నుంచి తమిళనాడు రాష్ట్రంలోని మకనపాళ్య గ్రామానికి బైక్‌లో వెళుతుండగా ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘటనలో తీవ్రగాయాలతో చనిపోయాడు. అటవీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గజ దాడులతో జనం ఆందోళనకు గురయ్యారు.


