భార్య హత్యకు భర్త సుపారీ
మైసూరు: భార్య తరచూ అవమానిస్తోందనే కసితో భర్త ఆమెను అంతమొందించాలని ఇద్దరు యువకులకు సుపారీ ఇచ్చాడు. దుండగులు సినిమా శైలిలో ఆమైపె పాశవికంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మైసూరు బిఎం శ్రీ నగరలో జరిగింది. వివరాలు.. భర్త మహేష్, కొడగు జిల్లాకు చెందిన కిరాయి నిందితులు భాస్కర్, అభిలను పోలీసులు పట్టుకున్నారు. పానీపూరి వ్యాపారి మహేష్, భార్య నాగరత్న (46)కు 18 సంవత్సరాల క్రితం పెళ్లయింది, వీరికి పిల్లలు లేరు. డబ్బు గొడవలతో నాగరత్న భర్తను చిన్నచూపు చూసేదని చెబుతారు. వీధిలోనే నిలబెట్టి దూషించేది. దీంతో ఆమెను హతమార్చాలని అతని నిశ్చయించి రూ. 5 లక్షలు సుపారీ కుదుర్చుకున్నాడు. నిందితులు భాస్కర్, అభి ఇద్దరూ రెండు రోజుల కిందట ఇంటికి వచ్చారు. ఆ సమయంలో భర్త షాపులో ఉన్నాడు, నాగరత్న పై అంతస్తులోని తన ఫ్లాటులో ఉండగా, దుండగులు హెల్మెట్లు ధరించి, కత్తులు పట్టుకుని చొరబడ్డారు. ఆమెను పొడిచి, గదిలో పెట్రోలు పోసి నిప్పంటించి పారిపోయారు. మంటల మధ్య ఆమె రక్తపు మడుగులో పడిపోయింది. స్థానికులు పట్టుకునేలోపు దుండగులు పారిపోయారు. భర్తను పిలిపించి ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. భర్తను అనుమానంతో పోలీసులు విచారించగా సుపారీ గుట్టు బయటపడింది. దీంతో ముగ్గురినీ అరెస్టు చేశారు. బాధితురాలు చికిత్స పొందుతోంది.
బాధితురాలికి తీవ్రగాయాలు


