నరాల సమస్యతో అంగవైకల్యం
కోలారు: నరాల సమస్య రాష్ట్రంలో మరణ, అంగవైకల్యానికి ప్రముఖ కారణం అవుతోందని బెంగళూరు మణిపాల్ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ఆర్.సా త్విక్ తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన అధ్యయనం ప్రకారం రాష్ట్ర జనాభాలో 3.3 శాతం మంది మెదడు, నరాల వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. కోలారు జిల్లాలో ఇది మరింత ఎక్కువగా ఉందన్నారు. అయితే ప్రస్తుతం లభ్యం అవుతున్న అత్యాధునిక వైద్య సాంకేతికత పరిజ్ఞానంతో రోగులకు సమగ్ర ఆరోగ్య చికిత్సను అందిస్తున్నారన్నారు. ఇది దీర్ఘావధి ఫలితాలను కూడా అందిస్తోందన్నారు. డీప్ బ్రెయిన్ స్టిములైజేషన్ విధానం పార్కిన్సన్ వ్యాధి, ఎసెన్షియల్ ట్రైమర్, డిస్టోనియా వంటి సమస్యలు ఉన్న వారికి ఎలా సహాయకారి అవుతుందో వివరించారు. పార్కిన్సన్ వ్యాధి మనిషి చలన వ్యవస్థపై ప్రభావం చూపుతుందన్నారు. ఇది నర మండలాన్ని అవనతి దిశగా తీసుకెళుతుందన్నారు. డీబీఎస్ చికిత్సా విధానంలో పార్కిన్సన్ వ్యాధి వల్ల కలిగే నరాలు బిగుసుకు పోవడం, వణుకు, నిధానగతిని గణనీయంగా తగ్గిస్తుందన్నారు. ఈ మెరుగైన చికిత్స రోగులకు అదనంగా 10–15 ఏళ్ల వరకు సంతృప్త జీవితం సాగించడానికి సహాయకారి అవుతుందన్నారు. పార్శవాయు మరణానికి మరో ప్రముఖ కారణం తక్షణం గుర్తించి చికిత్స పొందడం అవసరమన్నారు. మణిపాల్ ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ వీణా తదితరులు పాల్గొన్నారు.


