సెల్ఫీ మోజులో జలపాతంలో గల్లంతు
యశవంతపుర: జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటూ జారిపడి ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన చిక్కమగళూరు జిల్లా మల్లేనహళ్లి సమీపంలోని కామేనహళ్లి జలపాతంలో జరిగింది. బెళగావిలో ఇంజనీరింగ్ ఫస్టియర్ చదివే వరుణ్ దేశాయి (19), శుక్రవారం సాయంత్రం ఐదు మంది స్నేహితులతో కలిసి మూడు బైకుల్లో జలపాతానికి వెళ్లారు. మొబైల్‌లో సెల్ఫీ తీసుకుంటూ వరుణ్ పట్టుతప్పి కిందపడి గల్లంతయ్యాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది రాత్రి వరకు మృతదేహం కోసం గాలించినా జాడ లేదు. మళ్లీ శనివారం ఉదయం వెతగ్గా మృతదేహం దొరికింది. చిక్కమగళూరు గ్రామాంతర పోలీసులు కేసు నమోదు చేశారు. పరిచయంలేని జాగాలకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
అప్పుడు ఓట్ చోరీ అనలేదే?
శివాజీనగర: కాంగ్రెస్ గెలిచినపుడు ఓట్ల చోరీ ప్రశ్న లేదు, బీజేపీ గెలిస్తే మాత్రం ఓట్ చోరీ అంటారు, రాహుల్‌గాంధీది హిట్ అండ్ రన్ టీం అని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె విమర్శించారు. శనివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్‌వారు 135 సీట్లు ఎలా గెలుపొందారనేది సిద్దరామయ్య చెప్పాలి, రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కొవాలి, ఆరోపణలు చేసి పరుగెత్తి వెళ్లవద్దు అని హేళన చేశారు. కర్ణాటకలో, తెలంగాణ గెలిచినప్పుడు కాంగ్రెస్‌వారు ఎందుకు ఓట్ల చోరీ అనలేదని ప్రశ్నించారు.
యోగాచరణ
చిక్కబళ్లాపురం: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నగరంలోని ఎస్‌జెసిఐటి కాలేజీలో జిల్లా పాలకమండలి ఆధ్వర్యంలో యోగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొగాకు, షుగర్ లపై అవగాహన కలిగించారు. ఎడిసి భాస్కర్, అధికారులు యోగాసనాలను ఆచరించారు.
రాష్ట్రంలో డెంగీ,
చికెన్‌గున్యా బెడద
బనశంకరి: రోజురోజుకు డెంగీ, చికెన్‌గున్యా జ్వరాలు కోరలు చాస్తున్నాయి. ముఖ్యంగా బెంగళూరు నగరంలో అధికంగా డెంగీ కేసులు ప్రబలడం ఆందోళన కలిగిస్తోంది. రాజధానితో పాటు రాష్ట్రవ్యాప్తంగా 6 వేలకు పైగా డెంగీ కేసులు వెలుగుచూశాయి, సిలికాన్ సిటీలోనే 3 వేల మంది ఈ జబ్బుతో బాధపడుతున్నారు. సిటీలో 3048 మందికి, రాష్ట్రంలో మరో 3238 మంది డెంగీ జ్వరాల బారిన పడ్డారని ఆరోగ్యశాఖ విడుదల చేసిన నివేదికలో బహిర్గతమైంది. మొత్తం మీద రాష్ట్రంలో 6,278 మంది డెంగీకి గురి కావడంతో జనం ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో 934 చికెన్‌గున్యా కేసులు నమోదయ్యాయి. వాతావరణ మార్పులతో పాటు ఈ జబ్బులకు కారణమయ్యే దోమల బెడద ఎక్కువ కావడమే మూలమని భావిస్తున్నారు. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు పాటించాలని, ఇళ్ల లోపల, బయట పరిశుభ్రంగా ఉండాలని వైద్యులు సూచించారు.
పరప్పన జైలులో
హోంశాఖ కమిటీ తనిఖీ
బనశంకరి: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఖైదీల జల్సాలు, ఇతర అక్రమాలపై ఏడీజీపీ ఆర్.హితేంద్ర తో కూడిన కమిటీ సభ్యులు శనివారం జైలును సందర్శించారు. జైలులో కొందరు ఖైదీలకు రాజమర్యాదలు కల్పిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి, అత్యాచార నిందితుడు ఉమేశ్‌రెడ్డి, లష్కరే ఉగ్రవాది మొబైల్‌ఫోన్లలో మాట్లాడుతున్న వీడియోలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఇద్దరు జైలు అధికారులను సస్పెండ్ చేసి సమగ్ర విచారణకు కమిటీని ఏర్పరచింది. ఈ కమిటీలో ఐజీపీ సందీప్‌పాటిల్, ఎస్పీలు అమరనాథరెడ్డి, రిష్యంత్ ఉన్నారు. జైలులో పలు విభాగాలను పరిశీలించి అక్కడి అధికారులతో చర్చించారు. ఎలక్ట్రానిక్‌సిటి డీసీపీ నారాయణ కూడా పాల్గొన్నారు. జైలులో ఖైదీలను వారి బంధువులు కలిసేచోటు, సీసీ కెమెరాలు, మొబైల్ జామర్లను పరిశీలించారు. అధికారులు, సిబ్బంది బాధ్యతల గురించి ఆరా తీశారు. వీరు ఈ జైలుతో పాటు రాష్ట్రంలోని కారాగారాలను పరిశీలించి నెలరోజులలోపు హోంశాఖకు నివేదిక అందివ్వాలి.
సెల్ఫీ మోజులో జలపాతంలో గల్లంతు


