వృక్షమాతకు కన్నీటి వీడ్కోలు
శివాజీనగర: మొక్కలు, చెట్ల పెంపకమే జీవిత సర్వస్వంగా చేసుకున్న వృక్షమాత, పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క (114) శుక్రవారం బెంగళూరులో కన్నుమూయగా అశేష అభిమానులు, ప్రజలు విషాద సముద్రంలో మునిగిపోయారు. తిమ్మక్క అంత్యక్రియలు శనివారం బెంగళూరు జ్ఞానభారతి కళాగ్రామలో సకల ప్రభుత్వ గౌరవాలతో పూర్తి చేశారు. తిమ్మక్క పార్థివ శరీరాన్ని రవీంద్ర కళాక్షేత్రలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు సందర్శించి నివాళులు అ ర్పించారు. ఆ తరువాత పుష్పాలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా వృక్షమాత భౌతికకాయాన్ని తీసుకెళ్లారు. ప్రభుత్వ గౌరవాలతో అంత్యక్రియలను జరిపారు. లింగాయత సంప్రదాయం ప్రకారం సమాధిలో ఖననం చేశారు.
114 చోట్ల మొక్కలు నాటాలి
114 సంవత్సరాలు జీవించిన వృక్షమాత గౌరవార్థం రాష్ట్రంలో 114 స్థలాల్లో 114 మొక్కలు నాటాలని అటవీ, పర్యావరణ మంత్రి ఈశ్వర ఖండ్రె తెలిపారు. చెట్లనే పిల్లలనే మమకారంతో పెంచి ప్రపంచానికే వృక్షాల ప్రాధాన్యతను చాటిన సాలుమరద తిమ్మక్క పేరుతో మొక్కలు నాటడం ద్వారా అటవీ శాఖ గౌరవ సమర్పణ చేసుకోనుందని చెప్పారు. ఆమె పేరిట ఓ అవార్డును నెలకొల్పుతామని సర్కారు తెలిపింది.
బెంగళూరు జ్ఞానభారతి కళాగ్రామలో అంత్యక్రియలు
వృక్షమాతకు కన్నీటి వీడ్కోలు


