అప్పుడు భర్త.. ఇప్పుడు భార్య హత్య
దొడ్డబళ్లాపురం: ఆ కుటుంబాన్ని అత్యంత విషాదకరంగా హత్యలు వెంటాడుతున్నాయి. గతంలో భర్త పాశవికంగా హత్యకు గురికాగా, ఇప్పుడు భార్య కూడా అదే మాదిరి ప్రాణాలు కోల్పోయింది. ఇది శహబాద్ విషాద కథగా మారింది. కలబుర్గి జిల్లా యాదగిరి పట్టణంలో జరిగిన దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శహబాద్ నగరసభ మాజీ అధ్యక్షురాలు, సోషల్ వెల్ఫేల్ శాఖ ఉద్యోగిని అంజలి కంబనూర్ (38) మరణించింది. వివరాలు.. ఈ నెల 12న ఉదయం ఆఫీసుకు ఆమె కారులో డ్రైవరుతో కలిసి బయల్దేరింది. కొంతదూరం వెళ్లగానే కారులో వెంటాడిన దుండగులు ఆమె కారు అద్దాలను పగలగొట్టి కత్తులు, కొడవళ్లతో అంజలి మీద దాడి చేయడంతో ఆమె రక్తపు మడుగులో పడిపోయింది. ఆమె చనిపోయిందనుకుని దుండగులు వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను డ్రైవరు స్థానిక ఆస్పత్రికి , ఆపై హైదరాబాద్ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స ఫలించక ఆమె కన్నుమూసింది.
మూడేళ్ల కిందట భర్త
శహబాద్ నగరసభ అధ్యక్షుడు అయిన అంజలి భర్త, కాంగ్రెస్ నాయకుడు గిరీష్ కంబనూరు (42)ని 2022 జూలైలో కొందరు దుండగులు కొడవళ్లతో నరికి చంపారు. దీంతో ప్రభుత్వం అంజలికి కారుణ్య నియామకం కింద క్లర్కు ఉద్యోగమిచ్చింది. గతంలో ఆమె కూడా నగరసభ అధ్యక్షురాలిగా పనిచేశారు. భర్తను చంపినవారే భార్యను కూడా హత్య చేసినట్లు స్థానికంగా ప్రచారం సాగుతోంది. యాదగిరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు.
శహబాద్ నగరసభ మాజీ అధ్యక్షుల విషాదగాథ
మహిళా ఉద్యోగిని వెంటాడి హతం
కలబుర్గి జిల్లాలో కలకలం
జాడ లేని హంతకులు
అప్పుడు భర్త.. ఇప్పుడు భార్య హత్య


