బురదమయంగా పాఠశాల ఆవరణ
హుబ్లీ: పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో.. మధ్య కర్ణాటకలో వివిధ రంగాల్లో దూసుకుపోతున్న దావణగెరె జిల్లా జగళూరు తాలూకా హనుమంతపుర పాఠశాల ఆవరణం కుండపోత వానతో మురుగు నీరు యథేచ్ఛగా జొరబడి బురదమయంగా మారడంతో ఆ మురుగు నీటిలో రాలేక విద్యార్థులు స్కూలుకు డుమ్మా కొట్టారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న విద్యార్థుల హాజరు సంఖ్యకు అనుగుణంగా హెచ్‌ఎం సుజాత రెడ్డితో పాటు నలుగురు టీచర్లు, ఓ అతిథి ఉపాధ్యాయిని ఉన్నారు. 143 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో వసతులు ఫర్వాలేదు. వానలు ఎక్కువగా కురిస్తే ఆవరణం జలమయం కావడమే కాకుండా ఇరుగుపొరుగు మురుగు నీరు చేరుకోవడంతో విద్యార్థులు నడవటానికి కూడా కష్టకరంగా మారింది. దోమల రాజ్యం, గడ్డి ఇతర చెత్త చెదారం కూడా తక్కువేమీ లేదు. ఈ అస్తవ్యస్తాన్ని సరి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భూగర్భ జలం అధికం కావడంతో గత రెండేళ్ల నుంచి బోరుబావుల్లో నీరు ఉప్పొంగుతోంది. మొత్తానికి మరుగుదొడ్లు, పాఠశాల గదులు దుస్థితిలో ఉండగా. పైకప్పు కారుతోంది. ఈ విషయంపై అధికారులకు ఎంత మొర పెట్టుకున్నా స్పందించలేదని విద్యార్థులు వాపోయారు. ఇప్పటికై నా విద్యాశాఖ అధికారులు కాస్త కరుణ చూపి పాఠశాల ఆవరణ బాగు చేసి విద్యార్థులు భవితవ్యానికి బాటలు వేయాలని ప్రజలు కోరుతున్నారు.
వద్దు బాబోయ్ అంటూ స్కూల్ మానేసిన పలువురు విద్యార్థులు
దావణగెరె జిల్లా జగళూరు తాలూకా హనుమంతపురలో ఘటన
బురదమయంగా పాఠశాల ఆవరణ


