అభివృద్ధి పథంలో బళ్లారి
సాక్షి బళ్లారి: తనపై ఎంతో విశ్వాసం, నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోలేనిదని నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం తన 36వ జన్మదినం పురస్కరించుకొని నగరంలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, అన్నదానాలు, రక్తదాన శిబిరాలు, కనక దుర్గమ్మ ఆలయంతో పాటు పలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన జన్మదిన కార్యక్రమాల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బళ్లారి సర్వతోముఖాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానన్నారు. సువర్ణ బళ్లారిగా మార్చేందుకు కృషి చేస్తున్నానన్నారు. ఎన్నో నూతన పథకాలు అమలు చేశామన్నారు. ప్రతి రోడ్డును అభివృద్ది చేయడానికి ముందుకు వెళ్తున్నామన్నారు. నగరంలో పారదర్శక పాలనను అందిస్తున్నామన్నారు. నగరంలో నిరంతరం మంచినీటిని అందించేందుకు తుంగభద్ర డ్యాం నుంచి బళ్లారి నగరానికి నేరుగా నీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. నగరంలో రోడ్ల వెడల్పు, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు రూ.200 కోట్లతో పనులు చేపడుతున్నామన్నారు. ఇలా నగరంలో పలు రోడ్లు, స్వచ్ఛత కోసం చేపడుతున్న పనులకు నిధుల కొరత లేదన్నారు. జన్మదినం నేపథ్యంలో ముందుగా తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణరెడ్డి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకొన్నారు. నగరంలో ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేసి ఆయా వార్డుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల రుణం తీర్చుకుంటా
ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి


