మాతా శిశు మరణాలను అరికట్టాలి
హొసపేటె: జిల్లాలోని అన్ని ఆస్పత్రులలో మాతా, శిశు మరణాల కేసులు పెరగకుండా వైద్య అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, జాగ్రత్తగా విధులు నిర్వహించాలని జిల్లాధికారిణి కవిత ఎస్. మన్నికేరి సూచించారు. శుక్రవారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో జిల్లా యంత్రాంగం, జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన మాతా, శిశు మరణాలపై ఆడిట్ సమావేశానికి అధ్యక్షత వహించి ఆమె మాట్లాడారు. అన్ని ఆస్పత్రుల్లో నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి, వైద్యులు సకాలంలో ఆరోగ్య కేంద్రాల్లో ఉండాలన్నారు. రోగులను తనిఖీ చేయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మాతా శిశు, మరణాల పెరుగుదలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోడానికి, జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆస్పత్రిలో వైద్యాధికారులంతా ప్రతి శనివారం జిల్లా, తాలూకా స్థాయి సమావేశాలను నిర్వహించి లోపాలకు పరిష్కారాలను కనుగొనాలని ఆదేశించారు. ఈ విషయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గర్భిణులకు అత్యవసర సేవలు అవసరమైతే తాలూకా వైద్యాధికారులు, పర్యవేక్షక సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి చికిత్స అందించాలన్నారు. అందుబాటులో ఉన్న నిధులను నాణ్యమైన సేవలను అందించడానికి ఉపయోగించాలన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులకు ఆరోగ్య సలహాలు, నివారణ చర్యల గురించి వివరించాలన్నారు. గర్భిణులు, బాలింతల స్క్రీనింగ్, సురక్షితమైన డెలివరీ, పౌష్టికాహారంపై ఆయుష్ విభాగంతో సంప్రదింపులు జరపాలన్నారు. సాధారణంగా మాతృ మరణాల్లో ముఖ్యమైన రక్తహీనత, రక్తస్రావం అంశాలకు ఆరోగ్య శాఖ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె అన్నారు. జెడ్పీ డిప్యూటీ సెక్రటరీ కే.తిమ్మప్ప, జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ ఎల్‌ఆర్.శంకర్‌నాయక్, జిల్లా ఆర్‌సీహెచ్ అధికారి జంబయ్య, జిల్లా సర్వే అధికారి డాక్టర్ షణ్ముఖ నాయక్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ భాస్కర్, డాక్టర్ రాధిక, తాలూకా వైద్యాధికారులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


