నగరం.. జన సాగరం
సాక్షి, బెంగళూరు: ఐటీ సిటీ, మెట్రో సిటీ.. ఇలా ఎన్ని పేర్లతో పిలుచుకున్నా, ఎంత మంది వచ్చినా అక్కున చేర్చుకునేది బెంగళూరు నగరం. ఇదే బెంగళూరు పాలిట సమస్యగా మారింది. విపరీతమైన జన రద్దీతో సతమతమవుతోంది. సదుపాయాల కోసం ఒత్తిడి అధికమైంది. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచనవుతుంది అనే సామెత నగరానికి వర్తిస్తుంది.
బెంగళూరులో జనసంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. ఎక్కడెక్కడి నుంచో ఉపాధి, ఉద్యోగాలు, చదువుల కోసం తరలివచ్చేవారితో నిండిపోతోంది. 2031 నాటికి నగర జనాభా సుమారు కోటిన్నర దాటుతుందని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ (డీఈఎస్) చెబుతోంది. అంత దూరం అవసరం లేదు, రెండు మూడేళ్లు చాలని మరికొందరు చెబుతున్నారు. బెంగళూరు జనాభా 1.40 కోట్లకు పెరిగిందని ఇటీవల డిప్యూటీ సీఎం శివకుమార్ చెప్పడం తెలిసిందే.
ఈ ఏడాది అత్యధిక వలసలు
డీఈఎస్ ప్రకారం 2021లో నగర జనాభా సుమారు 1.22 కోట్లు. ఇది 2031 నాటికి 1.47 కోట్లకు పెరగనున్నట్లు అంచనా వేసింది. 2025–2026 ఏడాదిలో అత్యధిక మంది బెంగళూరుకు వచ్చినట్లు తెలిపింది. ఈ ఏడాది 1.93 శాతం మేర జనాభా అధికమైంది. గత 15 ఏళ్లలో ఇదే అత్యధికమని పేర్కొంది. కర్ణాటక జనాభాలో ప్రతి ఐదుగురిలో ఒకరు బెంగళూరు వాసి ఉండేంతలా నగర జనసంఖ్య విస్తరిస్తోంది.
2021 ఏడాదిలో కర్ణాటక మొత్తం జనాభాలో ఒక్క బెంగళూరు నగర వాటానే 18.2 శాతంగా ఉంది. 2031 నాటికి ఈ ప్రమాణం 20.7 శాతానికి పెరగనుందని డీఈఎస్ వెల్లడించింది. రాష్ట్రంలోని ఇతర నగరాలను అభివృద్ధి చేసి, బెంగళూరుపై ఒత్తిడిని తగ్గించాలని హెచ్చరించింది. 2021లో కర్ణాటక జనాభాలో నగరాల వాటా 43.9 శాతంగా ఉంది. 2031 నాటికి 47.8 శాతానికి పెరగవచ్చని అంచనా.
బెంగళూరు కేఆర్ మార్కెట్‌లో జనం.. జనం
జనాలతో కిక్కిరిసిపోతున్న బెంగళూరు
ఉద్యోగ, ఉపాధి కోసం
తరలివస్తున్న ప్రజలు
సౌకర్యాల కోసం తీవ్ర పోటాపోటీ
మరింతగా జనాభా వృద్ధి: డీఈఎస్ సర్వే
ఇక్కడే ఎందుకు
బెంగళూరులో తామరతంపరగా ఐటీ బీటీ కంపెనీలు పెరిగాయి. నిర్మాణ, ఆతిథ్య రంగం విస్తరిస్తోంది. రాష్ట్రంలోని ఇతర నగరాలన్నింటి కంటే అధికంగా, విద్య, ఆర్థిక, ఉద్యోగ అవకాశాలు బెంగళూరులో ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం వేలాదిగా తరలి వస్తున్నారు. దీనివల్ల ఏ మూల చూసినా జనంతో నిండిపోతోంది.
నగరం.. జన సాగరం


