చీకట్లు నింపిన టపాసులు
శివాజీనగర: సిలికాన్ సిటీలో వెలుగుల దీపావళి సంబరాల్లో ప్రమాదాలలో పెద్దసంఖ్యలో జనం గాయపడ్డారు. బాధితుల సంఖ్య గురువారం నాటికి 250 మందికి చేరింది. పటాకులను కాల్చేవారు, చూసేవారు విధివశాత్తు గాయాలపాలు కాగా, వీరిలో కొందరికి కళ్లే పోయాయి. ఒక్క నారాయణ నేత్రాలయంలో 100 మంది బాధితులు చేరారు, అందులో 50 మందికి పైగా పిల్లలున్నారు. 10 మందికి శస్త్రచికిత్స అవసరమైంది. కొందరు అడ్మిట్ కాగా, మరికొందరికి చికిత్స చేసి పంపారు. బాధితుల్లో సగం మంది టపాసులను కాల్చేవారు, మిగతా సగం మంది దారిన వెళ్లేవారు, చూసేవారు ఉన్నారు. మింటో కంటి ఆసుపత్రిలో 30 మంది చికిత్స పొందారు. శంకర కంటి ఆసుపత్రిలో 20 కేసులు నమోదుకాగా, ప్రభా కంటి ఆసుపత్రిలో గాయపడిన 10మందికి చికిత్స కల్పించడమైనది. అగర్వాల్ కంటి ఆసుపత్రిలో 10 మంది చికిత్స పొందారు.
పాపం.. వలస కూలీ
● బిహార్‌కు చెందిన వలస కూలీ యువకుడు శాశ్వత అంధత్వాన్ని పొందాడు, నగరంలోని అక్కిపేటలో ఉండేవాడు. ఫ్లవర్ పాట్ పేల్చేటపుడు ప్రమాదం సంభవించడమైనది. కంటి గుడ్డు చీలింది. ఫ్లవర్ పాట్ చేతిలో పట్టుకుని పోజు ఇస్తుండగా అది పేలిపోవడంతో ఓ కన్ను పూర్తిగా పోయింది, మరో కంటికి తీవ్ర గాయాలు తగిలాయి. మింటో ఆసుపత్రిలో యువకుడికి చికిత్స పొందుతున్నాడు.
● మరో ఘటనలో రోడ్డు మీద నడచుకొంటూ వెళుతున్న 67 సంవత్సరాల విదేశీ వృద్ధునికి టపాసు పేలి ఓ కంటికి బాగా గాయమైంది.
● 10 ఏళ్ల బాలునికి కంటి గుడ్డు కు తీవ్ర గాయమైంది. మరో 13 ఏళ్ల బాలునికి ఇదే సమస్య నెలకొంది.
● ఎక్కువమంది బాధితులకు ముఖం, కాళ్లు, చేతులకు కాలిన గాయాలయ్యాయి. విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొంది వెళ్లిపోయారు.
మూడు ముక్కలు..
మింట్లో ఆసుపత్రిలో కంటికి అపాయమైన 37 మందిలో కొందరికి అడ్మిట్ చేసి వైద్యం అందిస్తున్నారు. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరికి దృష్టి లోపం ఎదురైందని మింట్లో ఆసుపత్రి అదనపు డైరెక్టర్ డాక్టర్ శశిధర్ తెలిపారు. ఓ బాలునికి కంటి ముందు టపాసు పేలడంతో కన్ను మూడు ముక్కలైంది. కొడుకు దుస్థితిని చూసి అతని తల్లి కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది.
బెంగళూరులో 250 మందికి
పైగా గాయాలు
అనేకమందికి కళ్లకు దెబ్బలు
దృష్టిదోషం ఏర్పడే ముప్పు
కంటి వైద్యశాలలకు తాకిడి
చీకట్లు నింపిన టపాసులు
చీకట్లు నింపిన టపాసులు


