కడుపులోనూ బతకనివ్వరు
గర్భిణులకు వ్యథ
మైసూరు: అవాంఛిత గర్భం, కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని తేలితే నిర్దాక్షిణ్యంగా అబార్షన్లు చేసే ముఠా బాగోతమిది. మైసూరు తాలూకా హునగనహళ్లిలో అక్రమ అబార్షన్ల ముఠా పట్టుబడింది. ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి.. హునగనహళ్లిలోని తోటలో ఉన్న ఇంటిలో చట్టవ్యతిరేకంగా స్కానింగ్ సెంటర్‌ను తెరిచారు. ముఠా సభ్యులు.. వైద్యులు, తెలిసినవారిని కలిసి లింగ నిర్ధారణ చేస్తామని చెప్పేవారు. వేలాది రూపాయలను తీసుకుని స్కానింగ్ చేసేవారు. గర్భిణి కడుపులో ఉన్న శిశువు ఆడ, మగో చెప్పేవారు. ఇందుకు రూ.25 వేలు వసూలు చేస్తారు. ఇక ఆడ బిడ్డ ఉంది, అబార్షన్ చేయాలంటే మరింత డబ్బు ఇవ్వాలి. అక్కడే గర్భవిచ్ఛిత్తికి పాల్పడేవారు. అలా వందలాది అబార్షన్లు చేసినట్లు అనుమానాలున్నాయి. గర్భిణులు వద్దు వద్దంటున్నా వారి భర్తల ఒత్తిడితో అబార్షన్లు చేసేవారు.
ఆకస్మిక దాడి.. పట్టివేత
బన్నూరు రోడ్డు చుట్టుపక్కల గ్రామాల్లో కొంతకాలంగా గర్భస్థ లింగ నిర్ధారణ, అబార్షన్లు జరుగుతున్నాయని జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో గత రెండు నెలలుగా నిఘా పెట్టారు. హునగనహళ్లిలోని ఆ ఇంటి గురించి తెలియడంతో బుధవారం ఉదయమే అధికారులు, పోలీసులు సంయుక్త దాడులు జరిపి ముఠాను పట్టుకున్నారు. లాకర్‌లో ఉన్న రూ.3 లక్షలకు పైగా నగదును, స్కానింగ్ యంత్రాలు, గర్భస్థ నిర్ధారణ కిట్లు, ఔషధాలను స్వాధీనపరచుకున్నారు. స్కానింగ్‌కు వచ్చిన ఇద్దరు మహిళలను కూడా రక్షించారు. నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీహెచ్‌ఓ డాక్టర్ పీసీ కుమారస్వామి తెలిపారు.
ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్
మైసూరు వద్ద లింగనిర్ధారణ దందా
ఏడుమంది ముఠా అరెస్టు
కడుపులోనూ బతకనివ్వరు
కడుపులోనూ బతకనివ్వరు


