మిర్చికి తెగులు.. రైతన్నకు దిగులు | - | Sakshi
Sakshi News home page

మిర్చికి తెగులు.. రైతన్నకు దిగులు

Oct 23 2025 6:23 AM | Updated on Oct 23 2025 6:23 AM

మిర్చ

మిర్చికి తెగులు.. రైతన్నకు దిగులు

సాక్షి బళ్లారి: వరుసగా గత నాలుగేళ్ల నుంచి మిర్చి సాగు చేసిన రైతులు ఏదో రకంగా కష్టాలు, నష్టాలను చవిచూస్తూనే ఉన్నారు. మూడేళ్లుగా మిర్చి సాగు చేసిన రైతులకు పెట్టుబడి రాక, గిట్టుబాటు ధర దక్కక పోవడంతో ఎండు మిర్చిని కోల్ట్‌ స్టోరేజ్‌లోనే ఉంచి రేట్లు పెరుగుతాయనే ఆశతో రైతులు ఎదురు చూస్తూ కష్టాలను అనుభవిస్తున్నారు. మరో వైపు ఈ ఏడాది మిర్చిని సాగు చేసిన రైతులకు ప్రారంభం నుంచే సమస్యలు వెంటాడుతున్నాయి. తుంగభద్ర ఆయకట్టు పరిధిలో బళ్లారి, సిరుగుప్ప, కంప్లి, హొసపేటె తదితర ప్రాంతాల్లో విస్తారంగా మిరప పంటను సాగు చేశారు. గత మూడేళ్లుగా మిర్చి సాగు చేసిన రైతులు అప్పులు పాలు కావడంతో ఈ ఏడాదైనా పంట చేతికి అందిన తర్వాత గిట్టుబాటు ధర వస్తుందేమోనని ఆశించిన మిర్చి రైతులకు పంట కోత దశ మాట పక్కన పెడితే మిర్చిని సాగు చేసినప్పటి నుంచి ఏదో ఒక తెగుళ్లతో మిర్చి పంటకు రైతులు మందులు పిచికారీ చేయాల్సిన దయనీయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రతి నాలుగు రోజులకు ఒకసారి రైతులు వివిధ మందులను పిచికారీ చేస్తున్నారు.

నాలుగు రోజులకు ఒకసారి పిచికారీ

ప్రస్తుతం దోమ పోటు, నల్ల తామర పురుగు తదితరాలు మిర్చి పంటను వెంటాడుతున్న నేపథ్యంలో రైతులు వివిధ రకాల మందులను వాడుతున్నారు. ప్రతి రోజు మిర్చి పొలాల్లో రైతులు భుజాన మందు ట్యాంక్‌ను వేసుకొని పిచికారీ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మిర్చి పంట పొలాల్లో మిరపకాయలు కాసి కళకళలాడుతున్నప్పటికీ దోమ పోటు, నల్లతామర పురుగు వెంటాడుతుండటంతో ఆకు ముడత బారిన పడి పంట పూర్తిగా చేతికి అందే పరిస్థితులు వస్తాయో లేవోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మిర్చి సాగు చేసిన శంకరబండె, మంగమ్మ క్యాంపు తదితర గ్రామాలకు చెందిన ఎర్రిస్వామి, రుద్రగౌడ, గంగిరెడ్డి సాక్షితో మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే మిర్చి పంట సాగు సగానికి సగం తగ్గించామన్నారు. ఒక ఎకరానికి రూ.1.5 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టామన్నారు. ప్రస్తుతం దోమపోటు, ఆకుముడత తెగులు రావడం వల్ల ప్రతి నాలుగు రోజులకు ఒకసారి మందు పిచికారీ చేస్తున్నామన్నారు. ఎన్నిసార్లు పిచికారీ చేసిన ఆకుముడత తెగులు పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతు పొలంలో ఏపుగా కాసిన మిర్చి పంట

తెగుళ్ల నివారణకు సూచనలిస్తున్న నిపుణుడు

ఏపుగా పెరిగిన పంటను

వెంటాడుతున్న తెగుళ్లు

మొక్కలు నాటినప్పటి నుంచి తెగులుతో ఇబ్బంది

మిర్చి రైతుకు మిగిలింది కన్నీళ్లే

మిర్చి ధర మూడేళ్లుగా పతనం కావడంతో తాము మూడేళ్లుగా పండించిన మిర్చి పంటను కోల్డ్‌ స్టోరేజ్‌లో ఉంచామన్నారు. ప్రస్తుతం ఈ ఏడాది కూడా గత్యంతరం లేక మిర్చినే సాగు చేశామన్నారు. తెగుళ్లు వెంటాడుతుండటంతో మరింత ఆందోళనకు గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. తెగుళ్ల నివారణకు, దోమ పోటుకు, ఆకు ముడతను తగ్గించేందుకు బ్యారిక్స్‌ స్టికర్స్‌ ఎంతో మేలు చేస్తాయన్నారు. ఈ స్టికర్స్‌ను ప్రతి ఒక్క రైతు వినియోగించాల్సిందిగా సంబంధిత వ్యవసాయ నిపుణుడు టీ.హంపయ్య పేర్కొన్నారు. మ్యాజిక్‌ స్టికర్స్‌ ఎల్లో, బ్లూ వైట్‌ ఈ మూడు స్టికర్లను ఒక్కో ఎకరానికి 30 నుంచి 50 వరకు ఉపయోగించి మిర్చి పొలాల్లో ఉంచితే దోమలు వచ్చి స్టికర్స్‌పై వాలతాయన్నారు. దోమలు ఆ స్టికర్స్‌పై వాలడంతో వాటి ఉత్పత్తిని అరికట్టడానికి వీలవుతుందన్నారు. దీంతో మందులు ఉపయోగించాల్సిన అవసరం లేకపోగా పంట దిగుబడి కూడా బాగా వస్తుందన్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా ఆయకట్టు పరిధిలో విస్తారంగా సాగు చేసిన మిర్చి పంట చేతికి అందేలోపు బ్యారిక్స్‌ స్టికర్లను పెట్టవలసిందిగా రైతులకు ఆయా వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి మిర్చి పంటలో తెగుళ్ల నివారణకు తగిన సలహా సూచనలు అందజేయాలని మిర్చి రైతులు కోరారు.

మిర్చికి తెగులు.. రైతన్నకు దిగులు 1
1/1

మిర్చికి తెగులు.. రైతన్నకు దిగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement