రాఘవేంద్రుని సన్నిధిలో డీసీఎం
రాయచూరు రూరల్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠాన్ని కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని మంత్రాలయంలో రాఘవేంద్ర స్వాముల వారి దివ్య దర్శనం చేసుకున్న ఆయన వెంట రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నారు. ఆయనకు మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం రాయచూరు తాలూకా పంచముఖి గాణదాళ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసి, ప్రత్యేక దర్శనం పొందారు.
బ్రిడ్జి కం బ్యారేజీలు నిర్మించండి
రాయచూరు జిల్లా మాన్వి తాలూకా చీకలపర్వి, రాయచూరు తాలూకా చిక్కమంచాల వద్ద తుంగభద్రా నదిపై బ్రిడ్జి కం బ్యారేజీల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ సూచించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని మంత్రాలయంలో పద్మనాభ అతిథి గృహంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, గ్రామీణ శాసన సభ్యుఢు బసనగౌడ దద్దల్‌లతో సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చించి సాంకేతిక నివేదికల ఆధారంగా నిర్మాణం చేపట్టాలన్నారు. తాగు, సాగు నీటి విషయంలో గత ఏడాది రెండు ప్రాంతాల్లో బ్రిడ్జి కం బ్యారేజీల నిర్మాణం చేపడితే కర్నూలు జిల్లా సుంకేసుల వద్ద బ్రిడ్జి కం బ్యారేజీలో నీటి నిల్వ తగ్గుముఖం పడుతుందనే విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని సరిదిద్దాలని సూచించారు.
టీబీడ్యాం క్రస్ట్‌గేట్ల అమరికకు చర్యలు
తుంగభద్ర డ్యాం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అంశమని, తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్ల అమరికకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ వెల్లడించారు. బుధవారం పంచముఖి గాణదాళలో ఆలయాన్ని దర్శించుకొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది క్రస్ట్‌గేట్ తొలగిపోవడంతో ఇంజినీర్ల ఆదేశాల మేరకు నూతనంగా 37 గేట్ల అమరికకు చర్యలు చేపట్టామన్నారు. నవలి వద్ద నూతనంగా చేపట్టనున్న సమాంతర జలాశయం విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ ససేమిరా అంగీకరించడం లేదన్నారు. ఈ విషయంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు మూడు సార్లు సమావేశాలు నిర్వహించినా అక్కడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. రాష్ట్రంలో తుంగభద్ర, కృష్ణ, మహదాయి, మేకెదాటు వంటి నీటి వనరులకు కేంద్రం నుంచి గెజెట్ విడుదలపై బీజేపీ శాసన సభ్యులు, లోక్‌సభ సభ్యులు స్పందించాలన్నారు. రైతుల సంక్షేమం కోరుతూ రూ.20 వేల కోట్లతో పంప్‌సెట్ల కొనుగోలు, ఐదు గ్యారెంటీలకు రూ.53 వేల కోట్లు, పేదల సంక్షేమం కోసం రూ.లక్ష కోట్లు, కళ్యాణ కర్ణాటకలోని జిల్లాల అభివృద్ధికి రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించామన్నారు.
సమాజ సేవకు సిద్ధంగా ఉండాలి
సమాజ సేవకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ పిలుపునిచ్చారు. బుధవారం రాయచూరు తాలూకాలోని పంచముఖి గాణదాళలో గ్రామీణ కాంగ్రెస్ పార్టీ నూతన పదాధికారుల పదగ్రహణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. సమాజ సేవ చేసే పార్టీ కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పార్టీకి సేవలు అందించాలన్నారు. తమ ఉన్న భేదాభిప్రాయాలను మరిచి పార్టీకి పటిష్టతకు పాటు పడాలన్నారు. నాయకులు కావాలంటే కార్యకర్తల కష్టాన్ని మరిచి పోరాదన్నారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి పార్టీని అధికారంలోకి తేవాలన్నారు. పంచ గ్యారెంటీల వల్ల పేద ప్రజల కడుపు నిండుతోందన్నారు. పంచ గ్యారెంటీలను కాపీ కొట్టి బీజేపీ మహిళలకు రూ.10 వేలను బ్యాంక్ ఖాతాలోకి వేసిందన్నారు. సమావేశంలో రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్, గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ, శాసన సభ్యులు హంపయ్య నాయక్, బసన గౌడ తుర్విహాళ్, ఎమ్మెల్సీలు బసనగౌడ బాదర్లి, వసంత కుమార్, జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్ ఇటగి తదితరులున్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం దర్శనం


