ఎయిమ్స్ మంజూరు కోసం ధర్నా
రాయచూరు రూరల్: రాయచూరుకు ఎయిమ్స్ మంజూరు కోసం చర్యలు చేపట్టాలని మంగళవారం మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో 1259వ రోజు ఆందోళన కొనసాగింది. సమితి అధ్యక్షుడు బసవరాజ కళస మాట్లాడారు. రాయచూరుకు ఎయిమ్స్‌ను కేటాయించాలన్నారు. ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో మౌనం వహించకుండా గళం విప్పి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలంటూ ధర్నాకు మద్దతు పలికారు. జిల్లాను ఇతర జిల్లాల ప్రజాప్రతినిధులు పాలించినంత వరకు అభివృద్ధి జరగడం అసాధ్యమన్నారు. రాజకీయ నాయకుల కుట్రలకు జిల్లాను పట్టించు కొనేవారు ఎవరనే ప్రశ్న ఉదయిస్తోందన్నారు.
భారీ వర్షాలకు నేలకొరిగిన వరి
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు, కొప్పళ, కలబుర్గి, బీదర్, యాదగిరి జిల్లాల్లో మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు వరి పైరు నేలకొరిగింది. కలబుర్గి జిల్లా చించోళి తాలూకా నాగరహాళ, కనకపుర, రాయచూరు జిల్లాలోని సింధనూరు, మాన్వి, మస్కి, కవితాళ, కొప్పళ జిల్లా అంజనాద్రిలో అరగంట సేపు వానలు పడ్డాయి. ఇటీవల కురిసిన అతివృష్టితో వేలాది ఎకరాల్లో పంటనష్టం సంభవించగా కురిసిన వానలతో వరి దుబ్బులు నేలకొరగడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
అట్రాసిటీ కేసు నమోదు చేయండి
హొసపేటె: బెళగావి జిల్లా బాగేవాడి తాలూకా హుక్కేరిలో ఇటీవల విశ్వనాథ్ కత్తి వాల్మీకి సమాజంపై అవహేళనగా మాట్లాడటం సరి కాదని, వెంటనే ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మానవ సంబంధాల వేదిక విజయనగర జిల్లా సమన్వయకర్త ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్‌లో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వేదిక నేత సోమశేఖర్ మాట్లాడుతూ హుక్కేరి మోడల్ హైస్కూల్ మైదానంలో డీసీసీ బ్యాంక్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో బ్యాంక్ మాజీ అధ్యక్షుడు విశ్వనాథ్ కత్తి వాల్మీకి సమాజాన్ని అసభ్యకరమైన పదజాలంతో అవమానించారన్నారు. తద్వారా వాల్మీకి సమాజ ప్రజల మనోభావాలను దెబ్బ తీశారన్నారు.
రాఘవేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు
రాయచూరు రూరల్: మంత్రాలయం రాఘవేంద్ర స్వాముల మఠంలో దీపావళి ఉత్సవాలను మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ ప్రారంభించారు. బుధవారం మఠంలో రాఘవేంద్రస్వామి మూల విరాట్‌కు ప్రత్యేక పూజలు జరిపారు. బలి పాడ్యమి సందర్భంగా భక్తుల సమక్షంలో విశేష పూజలు, అభిషేకాలు చేశారు.
ఎయిమ్స్ మంజూరు కోసం ధర్నా
ఎయిమ్స్ మంజూరు కోసం ధర్నా
ఎయిమ్స్ మంజూరు కోసం ధర్నా


