కాలు లేకున్నా.. కలత లేదన్నా..
చెళ్లకెరె రూరల్ : వృద్ధులైన తల్లిదండ్రులను పోషించడం కోసం దివ్యాంగుడైన వీరణ్ణ కొరియర్ బాయ్‌గా విధులు నిర్వహిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. తల్లిదండ్రులు భారమయ్యారని వారిని వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్న నేటి యువకులు వీరణ్ణను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాలు పోయి కృత్రిమ కాలు పెట్టుకున్న యువకుడు వీరణ్ణ ప్రభుత్వం అందించిన త్రిచక్రవాహనాన్ని సద్వినియోగం చేసుకుని కొరియర్ బాయ్‌గా పని చేస్తూ నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు సంపాదిస్తున్నాడు. చెళ్లకెరె నగర నివాసి వీరణ్ణకు ప్రమాదంలో కాలు విరిగి పోయింది. చికిత్స అనంతరం కృత్రిమ కాలు పెట్టారు. ఎమ్మెల్యే టి.రఘుమూర్తి ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలతో వీరణ్ణకు త్రిచక్రవాహనం అందేలా చూశారు. కాలు లేకున్నా ఆత్మ స్థైర్యం కోల్పోని వీరణ్ణ ఫ్లిప్‌కార్టు కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. ప్రతి నిత్యం ఉదయం 7 గంటలకు విధులకు హాజరయ్యే వీరణ్ణ తన త్రిచక్రవాహనంలో ఇంటింటికి వెళ్లి కొరియర్ పార్శిల్ ఇచ్చి వస్తుంటారు.
కదలకుండా కూర్చొంటే జీవించడం ఎలా?
కాలు లేదని పని చేయకుండా చింతిస్తూ కదలకుండా కూర్చొంటే జీవించడం కష్టం. ఇంట్లో తల్లిదండ్రులను పోషించాలి. ప్రభుత్వం నుంచి నాకు త్రిచక్రవాహనాన్ని ఇప్పించిన ఎమ్మెల్యే రుణం తీర్చలేనిది. –దివ్యాంగుడు వీరణ్ణ
వృద్ధ తల్లిదండ్రుల పోషణే ధ్యేయం
కొరియర్ బాయ్‌గా దివ్యాంగుడు వీరణ్ణ


