
కల్యాణ కర్ణాటకకు నిర్మలా సీతారామన్ రాక
సాక్షి, బళ్లారి: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం నుంచి మూడు రోజుల పాటు కల్యాణ కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈమేరకు ఆమె మంగళవారం ఎక్స్‌లో కల్యాణ కర్ణాటక పరిధిలోని బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు, కలబుర్గి, బీదర్ జిలాల్లో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా జిల్లాల పరిధిలో వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన యూనిట్లను ప్రారంభిస్తుండటంతో పాటు రైతులతో చర్చిస్తామన్నారు. ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రైతు కుటుంబాలతో సమస్యలను అడిగి తెలుసుకుంటానన్నారు. ఆయా జిల్లాల్లో రైతులు పండించే పంటలు, సమస్యలు తదితరాలపై రైతులతో నేరుగా మాట్లాడతానన్నారు. కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న తాను ఈ ప్రాంతంలో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకుంటానన్నారు.
నిర్మల పర్యటనపై ఖర్గే ఎద్దేవా
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కల్యాణ కర్ణాటక పర్యటనకు విచ్చేస్తుండటం సంతోషంగా ఉందని, మొత్తం మీద ఆమె ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకునేందుకు వస్తున్నారని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర తరహాలో కర్ణాటకకు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాలని, ఉత్తుత్తి పర్యటనలతో లాభం లేదన్నారు.
నేడు కేంద్ర మంత్రి హంపీ సందర్శన
హొసపేటె: కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాత్రి 9 గంటలకు హంపీకి చేరుకుని జంగిల్ లాడ్జ్ రిసార్ట్‌లో బస చేస్తారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు హంపీలోని విరుపాక్ష ఆలయాన్ని సందర్శించి, దైవదర్శనం చేసుకుంటారు. హంపీ నుంచి ఆమె ఉదయం 9.15 గంటలకు కొప్పళ జిల్లాలోని మెటగల్లి గ్రామాన్ని సందర్శిస్తారు. ఆమె మధ్యాహ్నం 3 గంటలకు హొసపేటెలోని హోటల్ మల్లిగెలో నిర్వహించే పీఎంఎస్‌ఐ ఇంటర్న్‌లతో సంభాషిస్తారు. ఈనెల 17న ఉదయం 10.30 గంటలకు ఆమె బళ్లారి నుంచి కూడ్లిగి తాలూకాలోని కాసాపుర గ్రామానికి చేరుకుని అక్కడ రైతు శిక్షణ కేంద్రం, ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం 11.30 గంటలకు ఆమె కాసాపుర గ్రామం నుంచి రోడ్డు మార్గంలో బెంగళూరుకు బయలుదేరి వెళతారు.
నేటి నుంచి మూడు రోజుల పాటు
పలు జిల్లాల్లో పర్యటన