
కరెంటు షాక్‌కు ఏనుగు బలి
మండ్య: మండ్య జిల్లాలోని హలగూరు తాలూకా కరలకట్టె దగ్గర ఓ తోటలో కరెంటు తీగలు తగిలి మదగజం మరణించింది. వివరాలు.. గ్రామ రైతు రమేష్ తన తోటకు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వేశాడు. ఆదివారం రాత్రి ఓ 30 ఏళ్ల వయసున్న ఆడ ఏనుగు ఆహారాన్ని వెతుక్కుంటూ వచ్చింది, ఫెన్సింగ్ తీగలు తగలడంతో షాక్ కొట్టి అక్కడే ప్రాణాలు విడిచింది. సోమవారం ఉదయాన్నే ప్రజలు చూసి అటవీ సిబ్బంది తెలిపారు. జిల్లా అటవీ సంరక్షణ అధికారి రఘు, సహాయక అటవీ అధికారి మహాదేవ, పలు శాఖల అధికారులు వచ్చి పరిశీలించారు. పశువైద్యులు పోస్టుమార్టం జరిపి కరెంటు షాక్ వలన చనిపోయినట్లు తెలిపారు. అక్కడే సమీపంలో పూడ్చిపెట్టారు. రైతుపై కేసు నమోదు చేశారు.
గ్రేటర్‌పై సర్కారుకు
హైకోర్టు నోటీసులు
బనశంకరి: గ్రేటర్ బెంగళూరు ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, బీబీఎంపీ కి నోటీసులు ఇచ్చింది. నాలుగువారాల్లోగా సమాధానం ఇవ్వాలని తెలిపింది. సినీ డైరెక్టర్ టీఎస్.నాగాభరణ తదితరులు హైకోర్టులో పిల్ వేశారు. సోమవారం ప్రధాన న్యాయమూర్తి విభు భక్రు, సీఎం జోషి ధర్మాసనం విచారించింది. బీబీఎంపీ ఎన్నికలు జరిగి పదేళ్లు గడిచాయని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని నాగాభరణ న్యాయవాది పేర్కొన్నారు. గ్రేటర్ చట్టం కూడా రాజ్యాంగ వ్యతిరేకమని అన్నారు. బీబీఎంపీకి రానున్న మూడునెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించాలని కోరారు.
హంతకులను శిక్షించాలి
మండ్య: దక్షిణ కన్నడ జిల్లాలో సౌజన్య అనే విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసును ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. ఈ కేసును నిష్పక్షపాతంగా తనిఖీ చేయాలని సమాన మనస్క సంఘటన, మానవీయ మనస్కుల నాగరిక సంఘటనల ఆధ్వర్యంలో మండ్య నగరంలో ధర్నా చేశారు. జేసీ సర్కిల్‌లో చేరి నినాదాలు చేశారు. ధర్మస్థలలో 2012లో సౌజన్యను అత్యాచారం చేసి హింసించి హత్య చేశారన్నారు. హంతకులను శిక్షించాలని కోరారు. తరువాత కలెక్టరేట్‌లో అధికారులకు వినతిపత్రమిచ్చారు.

కరెంటు షాక్‌కు ఏనుగు బలి