
మత్తు పదార్థాలను అరికడదాం
రాయచూరు రూరల్ : జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లాధికారి నితీష్ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని నవోదయ వైద్య కళాశాల ఆవరణలో జిల్లాధికార యంత్రాంగం, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన మాదక వ్యసనాల నుంచి విముక్తిపై ప్రచారాందోళనలో పాల్గొని మాట్లాడారు. నేటి తరం యువకులు డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారన్నారు. యువకులు దురలవాట్లకు గురై ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. మత్తు పదార్థాల సేవనంతో ఆరోగ్యంతో పాటు మానసికంగా కుంగిపోతారన్నారు. యువత గంజాయి, హఫీం వంటి వాటికి బానిసలు కాకుండా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. ఒక్కరోజులోనే 9 కేసులను నమోదు చేశామని ఎస్పీ పుట్టమాదయ్య వెల్లడించారు. కార్యక్రమంలో డ్రగ్స్ నియంత్రణాధికారి ఉదయ్ కిశోర్, అదనపు ఎస్పీ హరీష్, డీఎస్పీ శాంతవీర, నవోదయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ దేవానంద్‌లున్నారు.