
మఠాల సేవలు ప్రశంసనీయం
హుబ్లీ: భారతీయ సంస్కృతిలో మఠాలకు ప్రత్యేక గౌరవం ఉంది, ఎన్నో మఠాలు పిల్లలకు భోజన వసతితో పాటు ఉచిత విద్యాభ్యాసం కల్పించడం ప్రశంసనీయం అని, వారి సేవలను సదా గుర్తు పెట్టుకోవాలని కుందగోళ ఎమ్మెల్యే ఎంఆర్ పాటిల్ పేర్కొన్నారు. ఆయన కుందగోళ తాలూకాలోని జిగళూరు గ్రామంలో సద్గురు శేషాచార్య గురువుల మఠం నిర్మాణం కార్యక్రమానికి ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.4 లక్షలు కేటాయించి భూమిపూజ నెరవేర్చిన అనంతరం మాట్లాడారు. జిగళూరు మఠానికి అభివృద్ధి చెందిన ఇతర మఠాల మాదిరిగా అన్నదానం చేసేంత శక్తి కలగాలని ఆకాంక్షించారు. జిగళూరు మఠం కూడా మరింతగా ఎదగాలని, గ్రామానికి మేలు జరగాలని కోరారు. ప్రముఖులు మాలతేష్, మంజునాథ పాటిల్, జగదీశ్, తమ్మణ్ణ, రేవణ్ణప్ప కట్టి పాల్గొన్నారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
రాయచూరు రూరల్: మనిషి ఆరోగ్య రక్షణకు యోగా దోహదపడుతుందని సీనియర్ యోగా సాధకుడు భవర్‌లాల్ అన్నారు. మంగళవారం ఎల్‌వీడీ కళాశాల మైదానంలో పతంజలి యోగా అధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుందన్నారు. యోగా ధ్యానంతో మానవుడి ఆయుష్షు వృద్ధి చెందుతుందన్నారు. ప్రతి ఒక్కరూ నిరంతరం యోగా, ధ్యానం చేయాలన్నారు. విఠోబ, పరమేశ్వర సాలిమఠ, రుతుగౌడ, అరుణలున్నారు.
రేపు సామాజిక నాటక ప్రదర్శన
బళ్లారిఅర్బన్: రాఘవ మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కాకర్లతోట కనుగోలు తిమ్మప్ప 25వ వర్ధంతిని ఏర్పాటు చేశారు. రాఘవ కళా మందిరంలో ఆ రోజు సాయంత్రం 6.30 గంటలకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా బళ్లారి రంగ సంస్కృతి సారథ్యంలో సంపద అనే తెలుగు సామాజిక నాటక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నాటకాన్ని వైఎస్.కృష్ణేశ్వరరావు రచించగా, లాల్‌రెడ్డి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించనున్నట్లు వారు వివరించారు.
అధిక ఫీజుల వసూలు తగదు
రాయచూరు రూరల్: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధికంగా డొనేషన్లు, ఫీజులు వసూలు చేయడం తగదని కర్ణాటక రైతు సంఘం సభ్యులు పేర్కొన్నారు. మంగళవారం దేవదుర్గలో విద్యా శాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మరిలింగ పాటిల్ మాట్లాడారు. మధ్య తరగతి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదవాలంటే రూ.లక్షల్లో డొనేషన్లు, వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నా జిల్లా, తాలూకా విద్యా శాఖాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడాన్ని ఖండించారు. అధిక ఫీజులు వసూలు చేయరాదంటూ అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా విద్యాధికారి బడిగేర్‌కు వినతిపత్రం సమర్పించారు.
చిన్న కారణానికి దాడి.. కులదూషణపై ఫిర్యాదు
హుబ్లీ: చిన్న కారణానికి దాడి చేసి ప్రాణాలు తీస్తామని బెదిరించడమే కాకుండా కులదూషణ చేశారని జిల్లాలోని కుందగోళ పోలీస్ స్టేషన్‌లో చెన్నబసప్ప, ఈరప్పలపై అనిల్‌కుమార్ ఫిర్యాదు చేశారు. వివరాలు.. కుందగోళ తాలూకాలోని రొట్టిగెవాడ గ్రామంలో నీటి తోపుడు బండిని తోచుకుంటూ వెళుతుండగా రోడ్డుపై అడ్డుగా ఉన్న రాయిని పక్కకు జరిపారన్న కోపంతో చెన్నబసప్ప, ఈరప్ప కలిసి తనపై మారణాయుధాలతో దాడి చేశారని, తన తల్లి, సోదరిపై కూడా దాడి చేసి చంపుతామని బెదిరించారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
భక్తులకు ప్రసాదం పంపిణీ
రాయచూరు రూరల్: దేవసూగూరులో భక్తులకు ప్రసాదంగా పెరుగన్నం పంపిణీ చేశారు. సూగూరేశ్వర ఆలయంలో 6000 మందికి పెరుగన్నం దానం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు ఉదయం సూగూరేశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిపి నైవేద్యం సమర్పించారు. దేవస్థానంలో భక్తులు మల్లప్ప, శశికళ తదితరులు పాల్గొన్నారు.

మఠాల సేవలు ప్రశంసనీయం

మఠాల సేవలు ప్రశంసనీయం