
స్టేడియంలో సదుపాయాలు కల్పిస్తాం
కోలారు : నగరంలోని విశ్వేశ్వరయ్య స్టేడియం గ్యాలరీ చుట్టూ పైకప్పు నిర్మాణానికి, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులను ఎమ్మెల్యే నిధుల నుంచి మంజూరు చేయిస్తానని కలెక్టర్ ఎం.ఆర్.రవి హామీ ఇచ్చారు. విశ్వేశ్వరయ్య స్టేడియంలో మంగళవారం ఏర్పాటు చేసిన క్రీడా మైదానం నిర్వహణ సమితి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం స్టేడియంలో పరిశీలన చేసి మాట్లాడారు. ఈ మైదానంలో జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహిస్తుండటం వల్ల అవసరమైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. క్రీడామైదానంలో బోరుబావిని తవ్విస్తామని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా ఎస్పీ బీ నిఖిల్, జిల్లా యువజన, క్రీడాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గీతా తదితరులు పాల్గొన్నారు.