
గ్రామీణ రోడ్లకు మహర్దశ
రాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి తాలూకాలో గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ప్రాముఖ్యత కల్పిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, విధానసభ సభ్యుడు హంపయ్య నాయక్ పేర్కొన్నారు. మంగళవారం మాన్వి తాలూకాలోని గణదిన్ని–శాఖాపుర మధ్య రూ.17.67 కోట్లతో చేపట్టనున్న తారు రోడ్డు నిర్మాణ పనులకు వారు భూమిపూజ చేసి మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణ పనులకు ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు.
అదృశ్యమైన అధికారి
శవమై తేలాడు
రాయచూరు రూరల్: రెండు రోజుల క్రితం అదృశ్యమైన అధికారి శఽవమై తేలిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. లింగసూగూరు తాలూకా మెదికినాళకు చెందిన మంజునాథ్ ఠాకూర్(32) మస్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తుండేవారు. ఈయన భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలిసి మస్కిలో నివాసం ఉండేవారు. రెండు రోజుల నుంచి భర్త వాహనం ఇంటి వద్దనే పెట్టి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే భర్త శవమై కనిపించడంతో తమకు న్యాయం చేయాలని వాపోయింది.
రైతులు పథకాల లబ్ధి పొందాలి
హొసపేటె: రైతులకు ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గవియప్ప తెలిపారు. మంగళవారం నగరంలో ఏపీఎంసీ యార్డులోని రైతు సంపర్క కేంద్రంలో రైతులకు ఉచితంగా విత్తనాలు, వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రైతులు తమ భూమిలో ఉన్న మట్టిని పరీక్షించి, మట్టికి అనుగుణంగా సరైన పంటలు వేసుకొని ఉత్తమ దిగుబడి సాధించాలన్నారు. వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శరణప్ప ముదగల్, డిప్యూటీ డైరెక్టర్ నయీం పాషా, అసిస్టెంట్ డైరెక్టర్ మనోహర్ గౌడ, శాఖ సిబ్బంది, రైతు నాయకులు, రైతు సంఘం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఇసుక మాఫియాపై చర్యకు భారీ బైక్ ర్యాలీ
హుబ్లీ: జిల్లాలో యథేచ్చగా ఇసుక మాఫియా జరుపుతున్న ఆగడాలపై మంగళవారం నగరంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి సదరు మాఫియాను నిర్మూలించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. కర్ణాటక రక్షణ వేదిక ప్రవీణ్ శెట్టి వర్గం జిల్లా అధ్యక్షుడు మంజునాథ లూతిమఠ సారథ్యంలో జరిగిన ఈ బైక్ ర్యాలీ అంబేడ్కర్ సర్కిల్ నుంచి ప్రారంభమైంది. విద్యానగర్, ఉణకల్ మార్గం గుండా జిల్లాధికారి కార్యాలయానికి చేరుకుంది. అక్కడ మంజునాథ మాట్లాడుతూ జిల్లాలో ఇసుక, మట్టి, క్వారీ దొంగలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మాఫియాతో చేతులు కలిపిన అధికారులను ఉన్నతాధికారులు బదిలీ చేయాలని ఒత్తిడి చేశారు. జిల్లాధికారి, గనులు, భూ విజ్ఞాన శాఖ అధికారులు తమ ఆందోళనను తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే రోజుల్లో తీవ్రమైన ఉద్యమం చేపడతామని కరవే నేతలు ప్రవీణ్ గాయకవాడ, అమిత్ తదితరులు కోరారు.

గ్రామీణ రోడ్లకు మహర్దశ