సూర్యోదయాన్నే కాల్పుల మోత
హుబ్లీ: కత్తిపోట్ల కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించిన క్రమంలో పోలీసులపై దాడి చేసి పరారవడానికి ప్రయత్నించిన నిందితుడి కాళ్లపై తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానిక హెగ్గేరి నివాసి, ఆటో డ్రైవర్ మల్లిక్ ఆదోనిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ విశ్వనాథ హాలదమట్టి, కానిస్టేబుల్ షరీఫ్ నదాఫ్ గాయపడ్డారు. ఈ ముగ్గురిని కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మల్లిక్‌తో పాటు 7, 8 మంది గుంపు సోమవారం రాత్రి హెగ్గేరి వద్ద ఇర్ఫాన్‌పై దాడి చేసి చాకుతో పొడిచారు. ఘటనపై పాత హుబ్లీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
నిందితుడు తప్పించుకోబోగా కాల్పులు
కీలక నిందితుడు మల్లిక్‌ను రాఘవేంద్ర కాలనీ శ్మశానం వద్ద అదుపులోకి తీసుకోడానికి వెళ్లగా పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. ఈ విషయమై పోలీస్ కమిషనర్ శశికుమార్ మాట్లాడుతూ నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు కాల్పులు జరిపారన్నారు. ఈ ఘటనలో నిందితుడితో పాటు పోలీసులు గాయపడ్డారన్నారు. ఇర్ఫాన్‌తో డబ్బులు తీసుకున్న మల్లిక్ డబ్బులు ఇవ్వకుండా తన సహచరులతో కలిసి సదరు ఇర్ఫాన్‌పై దాడి చేశారు. అయితే నిందితుడు మల్లిక్ తానే బ్లేడ్‌తో చేయి కోసుకొని తనపైనే దాడి చేశారని ఆస్పత్రికి వచ్చి అడ్మిట్ అయ్యాడు. అతడి ఫిర్యాదుపై దర్యాప్తు జరపగా అతడే నిందితుడని గుర్తించామన్నారు.
ఇద్దరూ రౌడీషీటర్లే
అతనిని అదుపులోకి తీసుకోడానికి ప్రయత్నిస్తుండగా ఈ క్రమంలో తప్పించుకోడానికి ప్రయత్నించగా రెండు రౌండ్లు కాల్పులు జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇర్ఫాన్, మల్లిక్ ఇద్దరూ రౌడీషీటర్లే అన్నారు. ఇర్ఫాన్‌పై హత్య తదితర కేసులు ఉండగా మల్లిక్‌పై హత్యాయత్నం, ఇతర కేసులు ఉన్నాయన్నారు. వీరిద్దరిపై పాత హుబ్లీ పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారన్నారు. ఆటో డ్రైవర్ అని చెప్పుకొని వడ్డీ వ్యాపారాలు, వాహనాల సీజింగ్ తదితర పనులకు పాల్పడేవారు. ఇతడిపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుందని, సరిహద్దుల నుంచి బహిష్కరించిందన్నారు. ఇలాంటి కృత్యాల్లో పాల్గొనే వారి జాబితా సిద్ధం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ వివరించారు.
ఆత్మరక్షణ కోసం పోలీసు కాల్పులు
రౌడీషీటర్ కాళ్లపైకి తూటాల వర్షం


