బళ్లారిఅర్బన్: పునీత్ రాజ్‌కుమార్ చిరుప్రాయంలోనే తన ప్రతిభా పాటవాలతో అపూర్వ ప్రజాదరణ సాధించి నిరాశ్రయులకు, నిరుపేదలకు అనన్యమైన సేవలు అందించి అప్పుగా కీర్తి గడించారని కర్ణాటక రక్షణ వేదిక శివరామేగౌడ వర్గం అధ్యక్షుడు రాజశేఖర్ తెలిపారు. పార్వతినగర్‌లోని కరవే కార్యాలయంలో పునీత్‌రాజ్‌కుమార్ జయంతిని స్ఫూర్తిదినంగా పాటించామన్నారు. పేదలపై పునీత్‌కు అపారమైన గౌరవం ఉండేదన్నారు. కుడిచేతితో చేసిన సహాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదనే గుణాన్ని అలవరుచుకున్న గొప్ప మానవతావాది పునీత్ రాజ్‌కుమార్ అని కొనియాడారు. పునీత్ సమాజ సేవ యువతకు స్పూర్తి అన్నారు. ఆయన పరోపకార గుణాన్ని ప్రతి యువకుడు తమ జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రముఖులు డేవిడ్, భరమరెడ్డి, రసూల్, ప్రకాష్, బసనగౌడ, రైతు నేత సిద్దిగేరి గోవిందప్ప, హగరి ప్రభాకర్, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
లారీ ఢీకొని బైక్ చోదకుని మృతి
హుబ్లీ: బైక్, లారీల మధ్య హొయ్సళ నగర్ బ్రిడ్జి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. సుభాష్‌చంద్ర కోరే (56) మృతుడు. హుబ్లీ నుంచి ధార్వాడకు వెళుతున్న వేళ వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన బైక్ చోదకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన వెళ్లి వెంబడించి తేగూరు వద్ద డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని లారీని స్వాధీనం చేసుకున్నారు.