● మునిసిపాలికా సదస్సులో సీఎం
శివాజీనగర: నగర, గ్రామీణ ప్రాంతాల సుస్థిర అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమని సీఎం సిద్దరామయ్య అన్నారు. మంగళవారం బెంగళూరులో ప్యాలెస్ మైదానంలో జరిగిన మునిసిపాలికా–2023 17వ సమ్మేళనాన్ని ప్రారంభించి మాట్లాడారు. దేశం సుస్థిరంగా అభివృద్ధి చెందాలంటే నగర, గ్రామీణ ప్రాంతాలు కూడా అదేరీతిలో ప్రగతి సాధించాలన్నారు. దేశంలో బ్రాండ్ బెంగళూరును నంబర్ వన్ చేయడానికి ప్రభుత్వం అన్ని విధాల చర్యలను చేపట్టిందన్నారు. రాష్ట్రంలో 32 శాతం మంది నగర ప్రాంతాల్లో నివాసిస్తున్నారు. వీరికి సదుపాయాలను కల్పించడం సవాల్‌తో కూడుకున్నదన్నారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 188 ఇందిరా క్యాంటీన్‌లను అదనంగా ఏర్పాటు చేస్తామన్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రులు పాల్గొన్నారు.
ఎవరైనా కోర్టుకు వెళ్లొచ్చు
రాష్ట్ర ప్రభుత్వం గతంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యతిరేకంగా సీబీఐ తనిఖీకి ఇచ్చిన అనుమతి చట్ట విరుద్ధమైనది, అందుకే దానిని రద్దు చేసినట్లు సీఎం చెప్పారు. తమ నిర్ణయాన్ని బీజేపీ నేత యత్నాళ్ కోర్టులో సవాల్ చేశారని, ఎవరైనా కోర్టుకు వెళ్లవచ్చని అన్నారు. బోర్డులు, కార్పొరేషన్‌ల పదవుల నియామకాలపై హోం మంత్రి పరమేశ్వర్ అసంతృప్తికి గురికావటంపై స్పందించిన సీఎం.. ఎంపిక ప్రక్రియ ఇప్పటికీ ప్రాఽథమిక దిశలో ఉంది. దీనిపై స్పందించటం సరికాదన్నారు. తెలంగాణలో కర్ణాటక సాధనలపై చేసిన ప్రచారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసినందున తాము పత్రికా ప్రచారాన్ని రద్దు చేసుకున్నట్లు తెలిపారు.