
సీనియర్ సిటిజన్లను సన్మానించిన దృశ్యం
బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా ఆనేకల్ పట్టణంలోని స్టేట్ బ్యాంకు శాఖలో కన్నడ రాజ్యోత్సవాలను అధికారులు ఘనంగా నిర్వహించారు. వేడుకలను మేనేజర్ రేవతి ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకులో ఖాతారులైన సీనియర్ సిటిజన్లను బ్యాంకు ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో కన్నడ సాహిత్య పరిషత్ ఆద్యుడు ఆదూరి ప్రకాశ్, హేమంత్, అజయ్ బ్యాంకు సిబ్బందితో పాటు బ్యాంకు ఖాతాదారులు పాల్గొన్నారు.
పుల్వామా దాడి జరగకుంటే మోది గెలిచేవాడు కాదు
●ఎమ్మెల్యే బాలకృష్ణ
దొడ్డబళ్లాపురం: గత ఎన్నికల సమయంలో పుల్వామా దాడి జరగకుండా ఉండిఉంటే మోది మరోసారి గెలిచి ప్రధాని అయ్యేవాడు కాదని, జనం ఆయనను ఇంటికి పంపించేవారని మాగడి ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. మాగడి తాలూకా తూబినకెరె గ్రామంలో డా.బీ.ఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో అమాయక సైనికులను బలి ఇచ్చిన ఘనత నరేంద్రమోదికి దక్కుతుందన్నారు. సైనికుల బలిదానంతోనే మోది మరోసారి ప్రధాని అయ్యాడన్నారు. ఆనాడు పూల్వామా దాడిపై విమర్శలు చేసిన కుమారస్వామి నేడు అదే బీజేపీతో జతకట్టడం విషాదనీయమన్నారు. అప్పట్లో సోనియాగాంధీ మల్లికార్జున ఖర్గెని ముఖ్యమంత్రిని చేద్దామనుకున్నారని, అయితే జేడీఎస్ నాయకులు పట్టుబట్టి ధరంసింగ్‌ను ముఖ్యమంత్రిని చేసారన్నారు. అప్పుడు తాను జేడీఎస్ ఎమ్మెల్యేగా ఉన్నానన్నారు. ఇప్పుడు అదే జేడీఎస్ నాయకులు మల్లికార్జున ఖర్గేకి అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్నారన్నారు. సిద్ధరామయ్యకు జేడీఎస్ పార్టీలో అన్యాయం జరగకుండా ఉంటే ఈరోజు జేడీఎస్ పార్టీ బాగుండేదన్నారు.
ప్రిన్సిపాల్, వార్డెన్ సస్పెండ్
యశవంతపుర: దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా కాకనూరు గ్రామంలోని కిత్తూరు రాణి చెన్నమ్మ వసతి పాఠశాల ప్రిన్సిపాల్ మంజునాథ్ పుర, హాస్టల్ వార్డెన్ నసీనాబాను కలెక్టర్ ఎంవీ వెంకటేశ్ సస్పెండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత 25 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలకు గురయ్యారు. విద్యార్థులు భోజనం చేసిన వంటకంలో పురుగులు పడిన్నట్లు విద్యార్థుల నుంచి సమాచారం తెలుసుకున్న కలెక్టర్ ఇద్దరిని సస్పెండ్ చేశారు.