ప్రత్యంగిరా ఆలయంలో యాగం | Sakshi
Sakshi News home page

ప్రత్యంగిరా ఆలయంలో యాగం

Published Wed, Nov 29 2023 1:28 AM

హోసూరుకు చేరుకొన్న కలం  - Sakshi

హోసూరు: హోసూరు సమీపంలోని మోర్నపల్లి గ్రామంలో అధర్వణ ప్రత్యంగిరాదేవి ఆలయంలో సోమవారం రాత్రి మిరపకాయల యాగాన్ని నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం నుంచి ఆలయంలో అమ్మవారికి అభిషేకం, రాహుకేతువులకు ప్రత్యేక అభిషేకం, కాలభైరవస్వామికి అభిషేకం అలంకారంతో పాటు వివిధపూజా కార్యక్రమాలను నిర్వహించారు. రాత్రి అమ్మవారి ఆలయంలో మిరపకాయల యాగం చేపట్టారు. పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పూజలు చేశారు.

విద్యార్థి ఆత్మహత్య

హోసూరు: కళాశాల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయకోట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకొంది. రాయకోట సమీపంలోని పిల్లారి అగ్రహారం గ్రామానికి చెందిన మారియప్ప కొడుకు ఏళుమలై (21) హోసూరులోని ప్రైవేట్‌ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రెండు సబ్టెక్టుల్లో ఫెయిల్‌ కావడంతో జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. తల్లిదండ్రులు వెంటనే రాయకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్సానంతరం క్రిష్ణగిరిలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఫలితంలేక మృతి చెందాడు. రాయకోట పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

బావిని శుద్ధీకరించండి

క్రిష్ణగిరి: తాలూకా కేంద్రం సూళగిరి పాత పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఉన్న తాగునీటి బావిని శుద్దీకరించి ప్రజల వినియోగానికి తీసుకురావాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. సూళగిరి దిగువ వీధిలో ఏర్పాటు చేసిన ఈ బావి నుంచి పట్టణ వాసులు తాగునీటి కోసం వినియోగించేవారని, కొద్ది సంవత్సరాలుగా బావిని పరామర్శించకపోవడంతో చుట్టుపక్కల ప్రజలు ప్లాస్టిక్‌ వ్యర్థాలను, చెత్తా చెదారాన్ని తీసుకెళ్లి బావిలో పడేయడంతో పారిశుభ్రత లోపించిందని, సూళగిరి పట్టణానికి తాగునీటి ఆధారంగా ఉన్న ఈ బావిని సంబంధిత శాఖాధికారులు శుద్దీకరించి ప్రజ ల వినియోగానికి తీసుకురావాలని కోరుతున్నారు.

నిందితుడు ఆత్మహత్య

కెలమంగలం: హత్య కేసులో నిందితుడు జామీనుపై బయటకొచ్చి ఆత్మహత్య చేసుకొన్న ఘటన క్రిష్ణగిరి డ్యాం పరిధిలో జరిగింది. వివరాల మేరకు క్రిష్ణగిరి సమీపంలోని తిమ్మరాయనహళ్లి గ్రామానికి చెందిన గోవిందన్‌ (65) అనే వృద్ధుడు 2022లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు. పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసి వేలూరు జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రితం జామీనుపై బయటకొచ్చిన అతను అనారోగ్యంతో బాధపడుతూ విరక్తి చెంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. క్రిష్ణగిరి డ్యాం పోలీసులు కేసు నమోదు చేశారు.

కరుణానిధి పెన్ను రాక

హోసూరు: మాజీ ముఖ్యమంత్రి, దివంగత కరుణానిధి శతజయంతోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పెన్ను ప్రదర్శన నిర్వహిస్తోంది. ఈ మేరకు మంగళవారం భారీ పెన్ను బొమ్మతో కూడిన వాహనం హోసూరుకు చేరుకుంది. ఎమ్మెల్యే వై.ప్రకాష్‌, మేయర్‌ ఎస్‌.ఏ.సత్య, కమిషనర్‌ స్నేహ, పారిశుద్దశాఖాధికారి ప్రభాకర్‌, ఉపమేయర్‌ ఆనందయ్య, ఎన్‌.ఎస్‌. మాదేశ్వరన్‌ తదితరులు ఘనస్వాగతం పలికారు. ప్రజలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. కరుణానిధి పేరుపొందిన రచయిత కావడంతో అందుకు గుర్తుగా పెన్ను ప్రదర్శన చేపట్టారు.

ఘనంగా కార్తీక పూజలు

పావగడ: వైఎన్‌ హొసకోటలోని చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. బిల్వార్చన, పంచామృతాభిషేకం, పూల అలంకారం తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

ఆకట్టుకునేలా ఇత్యాది

హోసూరు: కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలను ఆకర్షించే విధంగా చిత్రీకరించిన కన్నడ చిత్రం ఇత్యాది సినిమా త్వరలో విడుదల కానుందని, ఈ చిత్రాన్ని ప్రజలు ప్రోత్సహించాలని డైరెక్టర్‌ యోగిరాజ్‌ హోసూరులో జరిగిన విలేకరుల సమావేశంలో కోరారు. కొత్త వ్యక్తులతో స్థానిక ప్రజలను ఆకట్టుకొనేలా చిత్రాలను నిర్మించడమే ధ్యేయమన్నారు. కర్ణాటక రాష్ట్రం శృంగేరి ప్రాంతంలో షూటింగ్‌ ప్రారంభించి ఈ క్రైం థ్రిల్లర్‌ మూవీని చిత్రీకరించామని తెలిపారు. నటీనటులు సచిన్‌, సౌమ్య, సినీ బృందం పాల్గొన్నారు.

భారీ శబ్దాలతో రక్తనాళాలు స్తంభిస్తాయి

బొమ్మనహళ్లి: భారీ శబ్దాల వల్ల మనుషుల్లో రక్తనాళాలు స్తంభిస్తాయని ప్రముఖ శాస్త్రవేత్త, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఏరోస్పెస్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జగదీశ్‌ గోపాలన్‌ తెలిపారు. బెంగళూరు నగరంలోని బసవనగుడిలో ఉన్న నేషనల్‌ కళాశాలలోని డాక్టర్‌ హెచ్‌ఎన్‌ ఆడిటోరియంలో బెంగళూరు ఫోరం ఆధ్వర్యంలో సైన్స్‌పై నిర్వహించిన ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. బాణాసంచా, బాంబులు, సిలిండర్‌ వంటి పేలుళ్ల శబ్ధాలు మానవులకు ప్రమాదకరని, శబ్ధాలకు రక్తనాళాలల్లో రక్తం సరఫరా నిలిచిపోయి ప్రమాదకర పరిస్థితుల్లో పడిపోతారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రక్తనాళాలు సక్రమంగా పనిచేసేలా ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు.

చెత్తతో నిండిపోయిన బావి
1/2

చెత్తతో నిండిపోయిన బావి

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం
2/2

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం

 
Advertisement
 
Advertisement