కాంట్రాక్టర్‌ ఇంట్లో రూ.40 కోట్ల నగదు..

- - Sakshi

కర్ణాటక: ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ సిలికాన్‌ సిటీలో కాంట్రాక్టర్ల ఇళ్లలో వెతికే కొద్దీ నగదు కుప్పలు బయటపడుతున్నాయి. శనివారం అర్ధరాత్రి రాజాజీనగర కేతమారనహళ్లిలో కాంట్రాక్టర్‌ సంతోష్‌ కృష్ణప్ప అపార్టుమెంట్‌లోని ఫ్లాటులో ఐటీ అధికారులు సోదాలు చేయగా, రూ.40 కోట్ల నగదు లభించింది. 32 బాక్సుల్లో ఈ నగదు దొరికింది. ఆయనను ప్రశ్నించగా కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్సీ సీ.కాంతరాజుకు చెందినదని చెప్పారు.

ఆ నగదను గట్టి భద్రత మధ్య వ్యానులో తరలించారు. ఉదయం నుంచి రాత్రి వరకు అపార్టుమెంటు 5వ అంతస్తులోని సంతోష్‌ కృష్ణప్ప ఫ్లాట్‌లో రికార్డులు, ఫైళ్లు పరిశీలిస్తుండగా నగదు పెట్టెలు కనిపించాయి. దీంతో మరో 10 మందికి పైగా అధికారులు అక్కడికి చేరుకుని తనిఖీల్లో పాల్గొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ ప్రకటన వెలువడగానే బెంగళూరుపై ఐటీ అధికారులు దండయాత్ర చేపట్టారు. బడా సంపన్నుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. పాలికె కాంట్రాక్టర్‌ ఆర్‌.అంబికాపతి ఫ్లాటులో రూ.42 కోట్లు పట్టుబడడం తెలిసిందే.

నాకేమీ తెలియదు: కాంతరాజు
కాంట్రాక్టర్‌ సంతోష్‌ కృష్ణప్ప అపార్టుమెంట్‌లో లభ్యమైన నగదుతో తనకు సంబంధం లేదని మాజీ ఎమ్మెల్సీ కాంతరాజు చెప్పారు. తనకు అధికారులు ఎవరూ ఫోన్‌ చేయలేదని, నెలమంగల ఇంట్లో ఉన్నానని తెలిపారు. సంతోష్‌ కృష్ణప్ప ఎవరో తనకు తెలియదని, ఇందులో అనవసరంగా నా పేరు లాగుతున్నారని అన్నారు. నా తల్లిదండ్రులకు నేనొక్కడే కొడుకు, ఇంకెవరూ లేరన్నారు.

నగదుపై సీబీఐ విచారణ చేయాలి
కాంట్రాక్టర్ల వద్ద ఐటీ దాడుల్లో లభ్యమైన కోట్లాది రూపాయల నగదుపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ మాజీ మంత్రి సీటీ.రవి డిమాండ్‌ చేశారు. ఆదివారం మల్లేశ్వరంలోని బీజేపీ ఆఫీసులో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కుంభకోణాలు, అవినీతి అస్థిపంజరాలు ప్రతినిత్యం వెలుగుచూస్తున్నాయని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో సంగీత కళాకారుని నుంచి రూ. 3 లక్షలు కమీషన్‌ అడిగారని దుయ్యబట్టారు. కాంట్రాక్టర్‌ అంబికాపతి ఇంట్లో రూ.42 కోట్లు, మరో బిల్డర్‌ సంతోష్‌ కృష్ణప్ప ఇంట్లో రూ.40 కోట్లు లభించాయని, దీని వెనుక ఉన్నది ఎవరని అన్నారు. వీరిద్దరూ ఇద్దరు ప్రముఖులకు బినామీలని, సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు వస్తాయన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ చలవాదినారాయణస్వామి, భాస్కర్‌రావ్‌ పాల్గొన్నారు.

జిల్లాల్లో నేడు నిరసనలు

బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు

రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం ఉందని, దీనికి వ్యతిరేకంగా సోమవారం అన్ని జిల్లా, తాలూకా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ తెలిపారు. బీజేపీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ ప్రతి పనికీ రేటు ఖరారు చేసి, అధికారులతోనే అవినీతి ప్రారంభించిన ప్రభుత్వం, కళాకారులను కూడా వదిలిపెట్టలేదని దుయ్యబట్టారు. కాంట్రాక్టర్ల ఇళ్లలో దొరికిన డబ్బుకు– కాంగ్రెస్‌కు కచ్చితంగా సంబంధం ఉందన్నారు. ఇది లూటీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి , డిప్యూటీ సీఎం నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. ఇక్కడి నుంచి ఐదు రాష్ట్రాల ఎన్నికలకు డబ్బును పంపిస్తున్నారని ఆరోపించారు.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top