
పావగడ: తుమకూరు జిల్లా పావగడ తాలూకా లోని దొమ్మతమరి గ్రామ పంచాయతీ పరిధి లోని యల్లగానగుట్ట గ్రామంలో ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసిన కేసులో నిందితుడు కృష్ణమూర్తి కి 20 ఏళ్ళ జైలు శిక్షతో పాటు రూ 75 వేల జరినామా విధిస్తూ తుమకూరు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి శనివారం తీర్పు ఇచ్చారు. వివరాలు.. 2021లో జూలైలో 30వ తేదీన మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికను, ఆమె తమ్మున్ని నిందితుడు కృష్ణమూర్తి తన ఇంటి సమీపంలో మైదానంలో ఉన్న నేరేడు చెట్టు వద్దకు పండ్లు కోసిస్తానని పిలుచుకు పోయాడు.
అక్కడ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అప్పటి సీఐ లక్ష్మికాంత్ నిందితున్ని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో జడ్జి పి.సంధ్యారావ్.. పై మేరకు తీర్పు వెలువరించారు. జరినామా లో రూ 70 వేలు బాధితురాలికి ఇవ్వాలని, అలాగే జిల్లా న్యాయ సేవా సమితి నుంచి రూ 4 లక్షలు పరిహారాన్ని బాలిక కుటుంబానికి అందించాలని జడ్జి ఆదేశించారు.
మరో మృగాడికి 20 ఏళ్ల జైలు
ఇన్‌స్టా ద్వారా పరిచయమైన బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడికి మంగళూరు అడిషినల్ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. వివరాలు...బస్ డ్రైవర్‌గా పని చేస్తున్న కావూరు మరకడ నివాసి దయానంద దానణ్ణనవర్ (30)కు 13 ఏళ్ల విద్యార్థిని ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం అయింది. బాలికకు 2022 జనవరి 27న బయటకు వెళ్దామంటూ సందేశం పెట్టాడు. బాలిక నిరాకరించినా ఒత్తిడి చేసి జనవరి 28న ఆటోలో మంగళూరు పంపనకట్టెలోని లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. విషయం ఇంటిలో చెబితే చంపేస్తానని బెదిరించాడు.
బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాండేశ్వర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. కేసు విచారణ చేపట్టిన మంగళూరు అడిషనల్ కోర్టు నేరం రుజువు కావడంతో దోషికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ శనివారం తీర్పు చెప్పారు.