
శివాజీనగర: మరికొన్ని రోజుల్లో జరగబోతున్న రాష్ట్ర విధానసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం అతి త్వరలో నోటిఫికేషన్ వెలువరించనుండగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అప్పుడే తొలి విడత అభ్యర్థులను ప్రకటించింది. 124 నియోజకవర్గాల అభ్యర్థులను శనివారం ఉదయం విడుదల చేసింది. ఈ జాబితాలో బలమైన కులాలైన లింగాయిత్, ఒక్కలిగలకు పెద్దపీట వేయడం గమనార్హం. మిగతా 100 నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక పెండింగ్‌లో ఉంది. అనేక మంది ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ దక్కింది. తీవ్ర చర్చనీయాంశమైన సీఎల్పీ నేత సిద్దరామమయ్య చివరకు వరుణ నుంచే పోటీకి సిద్ధమయ్యారు. అక్కడ తనయుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే యతీంద్రకు చాన్సు లేనట్లే. ఇక కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్‌కు కనకపుర నుంచే బరిలో ఉంటారు.
ఏ వర్గంవారు ఎంత మంది?
ఈ జాబితాలో లింగాయిత్‌లు– 32 మంది, ఒక్కలిగులు 19 మంది, ముస్లింలు– 8, బ్రాహ్మణ, రెడ్డి, కురుబ కులాలవారు 5 మంది చొప్పున ఉన్నారు. ఈడిగ– 4, మరాఠా– 2, క్రైస్తవ, బంట్, రాజపుత్ర కులాలవారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఇక 22 ఎస్సీ, 10 ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు. తీవ్ర పోటీ, వివాదాస్పదమైన నియోజకవర్గాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.
తండ్రీ తనయులు, తండ్రీ కూతురు..
● పావగడలో ఎమ్మెల్యే వెంకటరమణప్పకు కాకుండా కుమారుడు హెచ్.వీ.వెంకటేశ్‌కు టికెట్ ఇచ్చారు.
● దావణగెరె దక్షిణ నుంచి శామనూరు శివశంకరప్పకు, దావణగెరె ఉత్తరలో తనయుడు ఎస్.ఎస్.మల్లికార్జునకు టికెట్ దక్కింది.
● మాజీ ముఖ్యమంత్రి ఎస్.బంగారప్ప కుమారుడు మాజీ ఎమ్మెల్యే మధు బంగారప్పకు సొరబలో అవకాశం ఇచ్చారు.
● బీజేపీ ఎంపీ అయిన బీ.ఎన్.బచ్చేగౌడ కుమారుడు, హొసకోట స్వతంత్య్ర ఎమ్మెల్యే శరత్ బచ్చేగౌడకు హొసకోట టికెట్ రావడం విశేషం.
● ఎన్నికల నుంచి తప్పుకోవాలనుకున్న తన్వీర్ సేట్‌ను మళ్లీ మైసూరు నరసింహరాజ నియోజకవర్గం నుంచే బరిలో నిలిపారు. కేపీసీసీ కార్యాధ్యక్షుడు సతీశ్ జార్కిహొళి యమకనమరడి నుంచి, ఈశ్వర్ ఖండ్రె భాల్కి నుంటీ పోటీ చేస్తారు.
● మరో కార్యాధ్యక్షుడు రామలింగారెడ్డి బెంగళూరు బీటీఎం లేఔట్ నుంచి, ఆయన కుమార్తె సౌమ్యారెడ్డి జయనగర నుంచి పోటీలో ఉంటారు. ఇక ఎంపీ డీకే సురేశ్ పేరు లేకపోవడం బట్టి ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయరని తెలుస్తోంది.
124 మంది అభ్యర్థులతో
కాంగ్రెస్ తొలి జాబితా
లింగాయత్, ఒక్కలిగ నేతలు అధికం
కనకపురలో డీకేశి, వరుణలో
సిద్దరామయ్య పోటీ
