రోడ్డు నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు నిబంధనలు పాటించాలి

Apr 15 2026 8:02 AM | Updated on Apr 15 2026 8:02 AM

రోడ్డు నిబంధనలు పాటించాలి ● వినాయకుడికి బాధితుల విన్నపం

కరీంనగర్‌క్రైం/కొత్తపల్లి(కరీంనగర్‌): ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా పోలీస్‌, రెవెన్యూ, రవాణాశాఖల ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్‌ కోర్టు చౌరస్తాలో ‘అరైవ్‌– అలైవ్‌’ రో డ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్‌ చిత్రా మిశ్రా, సీపీ గౌస్‌ఆలం రహదారి భద్రతపై ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ‘అరైవ్‌ అలైవ్‌’ పోస్టర్‌ ఆవిష్కరించారు. అనంతరం కొత్తపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలోని రేకుర్తి చౌరస్తాలో ‘అరైవ్‌ అలైవ్‌’ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీ గౌస్‌ ఆలం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు మానవ తప్పిదాలే ముఖ్య కారణం అన్నారు. హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ ధరించకపోవడం, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో గతేడాది 200 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని, అందులో ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ఉన్నారన్నారు. కొత్తపల్లి స్టేషన్‌ అధికారి, ట్రైనీ ఐపీఎస్‌ సోహం సునీల్‌, ట్రాఫిక్‌ ఏసీపీ యాదగిరిస్వామి, సీఐలు బిల్లా కోటేశ్వర్‌, సంజీవ్‌, కుమారస్వామి, సృజన్‌రెడ్డి పాల్గొన్నారు.

డంపింగ్‌యార్డ్‌ విఘ్నాన్ని తొలగించు స్వామి

కరీంనగర్‌ కార్పొరేషన్‌: డంప్‌యార్డ్‌ తొలగించేలా చూడు స్వామి అంటూ బాధితులు విఘ్నేశ్వర దేవుడ్ని వేడుకొన్నారు. డంప్‌యార్డ్‌తో తాము పడుతున్న కష్టాలను ఎవరూ పట్టించుకోవడం లేదని, దేవుడే కాపాడాలంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మంగళవారం నగరంలోని గిద్దెపెరుమాండ్ల స్వామి ఆలయంలో వినాయక విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. డంప్‌యార్డ్‌తో ఏర్పడుతున్న కాలుష్యంతో సమీప ప్రాంత వాసులు ఇబ్బంది పడుతున్నారని, చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన చెందారు. పడిశెట్టి భూమయ్య, దుంపేటి రాము, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మలయశ్రీ సాహిత్యం భావి తరాలకు మార్గదర్శకం

కరీంనగర్‌కల్చరల్‌: మలయశ్రీ సాహిత్య సేవలు అపారమని, ఆయన రచనలు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని కసప శ్యామ్‌ సుందర్‌ అన్నారు. మంగళవారం నగరంలోని ఐఏంఏ హాల్‌లో వివిధ సాహితీసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రముఖ కవి మలయశ్రీ సంస్మరణ సభలో ఆయన చిత్రపటానికి నివాళి అర్పించి మాట్లాడారు. తాను నమ్మిన ఆశయం కోసం చివరి శ్వాస వరకు నిలపడిన ఆచరణ వాది అన్నారు. ఆయన జీవిత చరిత్రను తీసుకురావాల్సిన అవసరం ఉందని, విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సభలో పాల్గొన్న వక్తలు తెలియజేశారు. కవులు గండ్ర లక్ష్మణరావు, నలిమెల భాస్కర్‌, బీఎన్‌.రావు, గాజోజు నాగభూషణం, సేనాధిపతి, సూరేపల్లి సుజాత, సబ్బని లక్ష్మీనారాయణ, సంకేపల్లి నాగేంద్ర శర్మ, మాడిశెట్టి గోపాల్‌ పాల్గొన్నారు.

కేసీఆర్‌ సభపై సన్నాహక సమావేశం

మల్యాల: జగిత్యాలలో ఈ నెల 20న నిర్వహించనున్న కేసీఆర్‌ బహిరంగ సభకు గ్రామాల నుంచి వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ కోరారు. మంగళవారం మల్యాలలో బీఆర్‌ఎస్‌ నాయకులతో సమావేశమయ్యారు. కేసీఆర్‌ బహిరంగ సభకు జన సమీకరణపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జనగం శ్రీనివాస్‌, మాజీ జెడ్పీటీసీ కొండపల్కల రాంమోహన్‌రావు, మాజీ ఎంపీపీ తైదల శ్రీలత, మాజీ సర్పంచ్‌ రౌతు రవి వర్మ, బద్దం తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement