మానసికంగా వేధిస్తున్నారు
రీచ్ కాకుంటే ఇంటికే
ప్రారంభమైన కార్పొరేట్ విద్యాసంస్థల ప్ర‘వేషాలు’
మండుటెండలో ఇంటింటికీ తిరుగుతున్న ప్రైవేట్ సిబ్బంది
పిల్లలను చేర్పిస్తేనే ఉద్యోగంలో కొనసాగింపు, జీతం పెంపు
ఉద్యోగులతో వెట్టిచాకిరీ, పట్టించుకోని విద్యాశాఖ
కరీంనగర్‌టౌన్: జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది మెడపై అడ్మిషన్ల కత్తి వేలాడుతోంది. 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు భారీగా చేయాలంటూ యాజమాన్యాలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నాయి. అడ్మిషన్ల సంఖ్యను బట్టే వచ్చే విద్యా సంవత్సరంలో జీతాల చెల్లింపు, ఇంక్రిమెంట్లు, ఉద్యోగభద్రత ఉంటుందనే యాజమాన్యాలు పెట్టే నిబంధనలతో సతమతమవుతున్నారు. టార్గెట్ కోసం ఉదయం, సాయంత్రం సమావేశాలు నిర్వహించి, వ్యక్తిగతంగా దురుసుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలల్లో 15 వేల మందికిపైగా బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తుండగా అందరిదీ అదే పరిస్థితి.
టార్గెట్ 10 నుంచి 40 అడ్మిషన్లు
ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నిత్యం 5 నుంచి 10 అడ్మిషన్లు చేయాలి. కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలల్లో పనిచేసే వారు 20 నుంచి 40వరకు అడ్మిషన్లు చేయాల్సిందే. దీంతో ఎండను సైతం లెక్కచేయకుండా ఉద్యోగులు కరీంనగర్‌తో పాటు హుజూరాబాద్, మానకొండూర్, చొప్పదండి, తదితర మండలాల్లో ఇంటింటా తిరుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ విద్యార్థుల వేటలో పడ్డారు. ‘మీ ఇంట్లో పిల్లలు ఎంత మంది.. ఏం చదువుతున్నారు.. ఎక్కడ చదువుతున్నారు.. మా పాఠశాల/కళాశాలలో చేర్పించండి. నాణ్యమైన బోధన ఉంటుంది. ఫలితాలు చూడండంటూ’ పేప ర్లు చూపుతున్నారు. సీటు ఇప్పుడు కన్ఫార్మ్ చేసుకుంటే ఫీజులో రాయితీ కూడా ఇప్పిస్తామంటూ చెబుతున్నారు. తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు తీసుకుని రోజూ నాలుగైదు సార్లు ఫోన్లు చేస్తున్నారు.
ఉద్యోగులతో వెట్టిచాకిరీ
అడ్మిషన్ల టార్గెట్లు ఒక్కటే కాకుండా, యాజమాన్యాలు తమతో వెట్టిచాకిరీ చేయిస్తున్నాయని బోధన, బోధనేతర సిబ్బంది అవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ 10 నుంచి 12 గంటలు పని చేయాలని, శని, ఆదివారం, జాతీయ సెలవు దినాలు, పండుగ రోజుల్లోనూ స్కూళ్లు, కళాశాలలకు వెళ్లాల్సిందేనని వాపోతున్నారు. పనికి తగ్గ వేతనాలు ఇవ్వడం లేదంటున్నారు. టీటీటీ, బీఈడీ, పీజీ, ఎంబీఏ తదితర కోర్సులు చేసి ఉపాధి కోసం పని చేస్తున్నామని, ఇక్కడ ఉద్యోగ భద్రత లేకపోగా పని ఒత్తిడి చేస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల పేరుతో టీచర్లు, అధ్యాపకులను మానసికంగా వేధిస్తున్నారు. సెలవు దినాల్లోనూ పని చేయించుకుంటున్నారు. టీచర్లు, అధ్యాపకులను బోధనేతర పనులకు ఉపయోగించుకుంటున్నారు. వర్క్‌షాపుల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా చాలా విద్యాసంస్థల్లో జీతాలు కూడా సరిగా ఇవ్వడం లేదు. – బి. ధనుంజయ, ప్రైవేట్ టీచర్


