కోరుట్ల: కోరుట్లలో కొంతకాలంగా వ్యాపారులను బెదిరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న రౌడీషీటర్ విత్తనాల నాగరాజును ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రాములు ఆదేశాలతో మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ సురేష్ బాబు తెలిపారు. నాగరాజుపై గతంలో రెండు హత్యకేసులు, ఇతరత్రా కేసులు ఉన్నాయని, పీడీ యాక్ట్ కేసు కూడా నమోదు చేసి జైలుకు పంపించామని వివరించారు. వ్యాపారులను బెదిరించిన ఘటనలో నాగరాజుతోపాటు మరొకరు కూడా ఉన్నట్టు దర్యాప్తులో తేలిందని, సదరు వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలిపారు. వీరితోపాటు ఇంకెవరు ఉన్నా పట్టుకుంటామన్నారు. నాగరాజు, అతడి అనుచరులతో ఎవరైనా సంబంధాలు కలిగి ఉంటే వారిపై ప్రత్యేక నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎవరైనా బలవంతపు వసూళ్లకు పాల్పడితే తమ దృష్టికి తేవాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని వివరించారు. కార్యక్రమంలో ఎస్సై చిరంజీవి పాల్గొన్నారు.


