కోనరావుపేట(వేములవాడ): అనారోగ్యంతో ఉన్న కోడెలను పంపిణీ చేశారని కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన బడే స్వామిదాస్ ఆరోపించారు. బాధితుడి కథనం ప్రకారం.. స్వామిదాస్ వేములవాడ రాజన్న కోడెల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మొదట క్రిస్టియన్ పేరు ఉన్నదని అధికారులు తిరస్కరించారు. తాను కోడెలను పోషించుకుంటానని అధికారులను వేడుకోవడంతో రెండు కోడెలను పంపిణీ చేశారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న కోడెలను అందించారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. స్థానిక పశువైద్యాధికారులను సంప్రదించగా వారు వచ్చి పరిశీలించి కోడెలకు వచ్చిన వ్యాధిని గుర్తించలేకపోతున్నారని పేర్కొన్నాడు. కోడెలకు వెనకాల చుక్కల మాదిరిగా పుండ్లు అవుతున్నాయని చికిత్స చేయించినా తగ్గడంలేదని వాపోయాడు. గతంలో కూడా అనారోగ్యంతో బాధపడుతున్న కోడెలను ఇవ్వగా వాటికి చికిత్స చేయించినా మృతి చెందాయని తెలిపాడు.


