సురక్షిత ప్రయాణం.. సుఖమయ జీవనం | - | Sakshi
Sakshi News home page

సురక్షిత ప్రయాణం.. సుఖమయ జీవనం

Apr 14 2026 7:52 AM | Updated on Apr 14 2026 7:52 AM

● మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ● పోలీసుల ఆధ్వర్యంలో ‘అరైవ్‌ అలైవ్‌’పై అవగాహన

తిమ్మాపూర్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, రవాణా శాఖల సమన్వయంతో తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణకాలనీలో సోమవారం ‘అరైవ్‌ అలైవ్‌’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజ రైన మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు పేద, ధనిక అనే తేడా లేకుండా అందరి ప్రాణాల నూ హరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దన్నారు. మద్యం సేవించి వాహనం నడపడమే అధిక ప్రమాదాలకు కారణమన్నారు. కలెక్టర్‌ చిత్రా మిశ్రా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలతో ఛిన్నాభిన్నమైన కుటుంబాల గాథలు వింటే మనసు కలచివేస్తోందన్నారు. సర్పంచులు తమ గ్రామసభల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేకంగా చర్చించాలని, స్పీడ్‌ బ్రేకర్లు, రోడ్డు లైటింగ్‌ కల్పనపై శ్రద్ధ వహించాలని సూచించారు. సీపీ గౌస్‌ ఆలం మాట్లాడుతూ, గతేడాది జిల్లాలో 200 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని, అందులో ద్విచక్ర వాహనదారులే అధికమని వెల్లడించారు. పోలీసుశాఖ చర్యలతో ప్రమాదాల రేటు 17 శాతం తగ్గిందన్నారు. అనంతరం ‘అరైవ్‌– అలైవ్‌’ కార్యక్రమ వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించారు. సర్పంచ్‌ శ్వేత అధ్యక్షతన 10 మంది సభ్యులతో కూడిన రోడ్‌ సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేశారు. పలువురికి హెల్మెట్లు అందజేశారు. డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement