గ్రానైట్‌ బ్లాక్‌ దందాపై కొరడా | - | Sakshi
Sakshi News home page

గ్రానైట్‌ బ్లాక్‌ దందాపై కొరడా

Apr 14 2026 7:52 AM | Updated on Apr 14 2026 7:52 AM

● కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌ మెట్లెక్కుతున్న వ్యాపారులు ● అయినా ఆగని అక్రమ రవాణా, జీఎస్టీ ఎగవేత

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌/కొత్తపల్లి: గ్రానైట్‌ కటింగ్‌, పాలీషింగ్‌ పరిశ్రమల బ్లాక్‌ దందాపై ట్రైనీ ఐపీఎస్‌, కొత్తపల్లి స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ కొరడా ఝలిపిస్తున్నారు. ‘గ్రానైట్‌ బ్లాక్‌ దందా’ శీర్షికన ‘సాక్షి’లో ఈ నెల 3న ప్రచురితమైన కథనంతో ట్రైనీ ఐపీఎస్‌ సోహం సునీల్‌ ప్రత్యేక దృష్టి సారించారు. పదుల సంఖ్యలో వాహనాలు పట్టుబడటంతో జరిమానా నిమిత్తం మైనింగ్‌, రవాణాశాఖకు పంపించారు. మరికొన్ని వాహనాలు పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోనే నిలిచి ఉన్నాయి. దీంతో వాహనాలను విడిపించుకునేందుకు గ్రానైట్‌ వ్యాపారులు కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కుతుండటంతో స్టేషన్‌ పరిసరాలు సందడిగా మారాయి. కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌, ఖాజీపూర్‌, ఎలగందుల, శ్రీరాములపల్లి, కమాన్‌పూర్‌, నాగులమల్యాల, బద్ధిపల్లితో పాటు గంగాధర మండలం ఒడ్యారం తదితర గ్రామాల్లోని గ్రానైట్‌ కటింగ్‌, పాలీషింగ్‌ పరిశ్రమల నుంచి అక్రమంగా రవాణా అవుతున్న గ్రానైట్‌ బ్లాక్‌ దందాను అడ్డుకునేందుకు ట్రైనీ ఐపీఎస్‌ సోహం సునీల్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారం రోజుల్లో 20కి పైగా వాహనాలు ఓవర్‌లోడ్‌, అనుమతుల్లేకుండా, జీఎస్టీ చెల్లించకుండా, తదితర కారణాలతో పట్టుబడుతుంటే అక్రమ దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. వ్యాపారులు గ్రానైట్‌ అక్రమ రవాణాలకు పాల్పడుతూ జీఎస్టీ ఎగవేస్తున్నారు. మార్కెటింగ్‌ ఎక్కువగా ఉన్న రాజస్థాన్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు గ్రానైట్‌ రవాణా విషయంలో బయ్యర్లతో ఒప్పందం కుదుర్చుకుంటూ జీఎస్టీ బిల్లుతో ఒక రేటు, బిల్లు లేకుండా మరో రేటు మాట్లాడుకుంటున్నారు. ఎక్కువ మొత్తంలో జీఎస్టీ లేకుండానే ఎగుమతులు జరుగుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

Advertisement
 
Advertisement
Advertisement