వీర్నపల్లి(సిరిసిల్ల): తల్లిదండ్రుల కష్టాలను కళ్లారా చూసింది. చదువు ఒక్కటే జీవితాన్ని బాగు చేస్తుందని నమ్మింది. కష్టపడింది.. రాష్ట్రస్థాయి రెండో ర్యాంక్ సాధించింది. ఈ విజయం వెనుక కష్టాలు కన్నీళ్లు ఉన్నాయి. గిరిజన ప్రాంతంలో పుట్టిన తేజస్వినీ తన ప్రతిభతో శభాష్ అనిపించుకుంది. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం భూక్యతండాకు చెందిన గిరిజన పుత్రిక లకావత్ తేజస్విని ఇంటర్ ఫలితాల్లో హెచ్‌ఈసీలో 1000 మార్కులకు 978 సాధించి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంక్ సొంతం చేసుకుంది. భూక్యతండాకు చెందిన లకావత్ రాజు, అనిత దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పేదరికంతో పిల్లల చదువుకు ఆటంకం కలగకూడదని తండ్రి రాజు అప్పులు చేసి ఉపాధి వెతక్కుంటూ దుబాయ్ వెళ్లాడు. తల్లి అనిత గ్రామంలోనే ఉంటూ ఉపాధిహామీ పనులు, ఇతర కూలి పనులు చేస్తోంది. వీరి కూతురు లకావత్ తేజస్విని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్‌మీడియట్ పూర్తి చేసింది. హెచ్‌ఈసీలో 1000 మార్కులకు 978 సాధించి రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకును కై వసం చేసుకుంది. గిరిజన బిడ్డ సాధించిన ఈ విజయంపై స్థానికులు, తండావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి చెందిన అమ్మాయి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపడం గర్వకారణమని గిరిజన సంఘాల నాయకులు కొనియాడారు. చదువుకోవాలనే కసి ఉండాలే గానీ పేదరికం అడ్డుకాదని తేజస్విని నిరూపించిందని గ్రామ సర్పంచ్ రామావత్ శ్రీకాంత్ అభినందించారు.
మా నాన్న దుబాయ్‌లో, అమ్మ ఇక్కడ కూలి పనుల్లో పడుతున్న కష్టం నాకు తెలుసు. వారి కష్టాన్ని చూస్తూ పెరిగాను. ఎలాగైనా వారికి మంచి పేరు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ప్రభుత్వ కళాశాల అధ్యాపకుల ప్రోత్సాహం, నా తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈ ర్యాంకు సాధించగలిగాను.
– తేజస్విని, విద్యార్థిని
తండ్రి దుబాయ్‌లో వలస కార్మికుడు.. తల్లి ఉపాధిహామీ కూలీ
రాష్ట్రస్థాయిలో ప్రతిభచాటిన లకావత్ తేజస్విని


