కరీంనగర్‌టౌన్: దేశ స్వాతంత్య్రం, సమసమాజ స్థాపనకు పోరాటం చేసిన త్యాగధనుల స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని బాబు జగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పిలుపునిచ్చారు. జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ఆదివారం నగరంలోని మంచిర్యాల చౌరస్తా వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ 40ఏళ్ల పాటు ప్రజాప్రతినిధిగా, వ్యవసాయ, రక్షణశాఖలతో పాటు దేశ ఉప ప్రధానిగా సేవలందించిన జగ్జీవన్‌రామ్‌ను స్మరించుకోవడం మన కర్తవ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఇందిరమ్మ ఇల్లు, అసైన్డ్ భూములు ఇచ్చినట్లు తెలి పారు. కలెక్టర్ చిత్రామిశ్రా మాట్లాడుతూ ఎస్సీ సంక్షేమశాఖ, ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా అందించే సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ కేసుల విచారణ, పరిహారం అందించే విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ దేశ అభివృద్ధికి, బలహీన వర్గాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. నగరపాలక కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సీనియర్ నాయకుడు సముద్రాల అజయ్ మాట్లాడుతూ శాతవాహన యూనివర్శిటీలో అర్బన్ నక్సల్స్ అంటూ విద్యార్థుల మధ్య విభేదాలు సృష్టిస్తున్న వారిని గుర్తించాలని సీపీ, కలెక్టర్‌ను కోరారు. అనంతరం కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రోత్సాహకాలు అందజేశారు. జయంతి ఉత్సవ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గంటల రేణుక, క్యాదాసి ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల (రెవెన్యూ) కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్టీవో మహేశ్వర్, దళిత సంఘాల నాయకులు బెజ్జంకి అనిల్, కన్నం అంజయ్య, మేడి అంజయ్య, రొంటాల స్వప్న, కొరివి వేణుగోపాల్, లక్ష్మణ్, మేడి మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
నిరసనలు, నిలదీతలు
ఆలిండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి మేడి మహేశ్ ఆధ్వర్యంలో దళితులను చిన్నచూపు చూస్తున్నారని, జయంతి కమిటీలో చోటు కల్పించలేదని నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సత్యం జోక్యం చేసుకొని వేదికపైకి పిలిచి మాట్లాడించగా, వర్గీకరణ రద్దు చేయాలని, 15శాతం రిజర్వేషన్ 25 శాతానికి పెంచాలని మహేశ్ మాట్లాడడంతో ఎమ్మార్పీఎస్ నాయకులు నినాదాలు చేస్తూ దూసుకురావడంతో గందరగోళం నెలకొంది.


