కేసు నమోదు చేశాం
పోలీసులు పట్టాదారుల ఫైల్స్ అడగవద్దు
చందుర్తి(వేములవాడ): భూముల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో కబ్జాదారుల కన్ను ప్రభుత్వ భూములపై పడింది. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగా రు. డబ్బుకు లోకం దాసోహం అని తెలుసుకొని కాసులు ముట్టజెప్పి ఓ ముఠాతో చేతులు కలిపారు. పట్టేదారు పాసుపుస్తకాలు పొందారు. ఈ విషయం నకిలీ పాసుపుస్తకాల ముఠా బాధితుడి ఫి ర్యాదుతో బయటకు పొక్కుతున్నాయి. నకిలీ పాసుపుస్తకాలు పుట్టుకొస్తున్న వైనంపై ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ.
ఇలా అక్రమదందాకు తెర
రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లెకు చెందిన బొల్లు శ్రీనివాస్ ఎన్గల్‌కు చెందిన గుంటి మల్లేశం మధ్యవర్తిత్వంతో జోగాపూర్ శివారులోని ఎకరం భూమిని రెండేళ్ల క్రితం రూ.12లక్షలకు కొనుగోలు చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అందులో అసైన్డ్ సమస్య ఉందని చెబితే రూ.లక్ష ఇస్తే అన్ని చూసుకుంటానని నమ్మించాడని బాధితుడు బొల్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. కానీ ఇక్కడే అసలు తిరకాసు ఉంది. గుంటి రాజయ్య భూమిని బొల్లు శ్రీనివాస్ 1995 మే 10నలో కొనుగోలు చేసినట్లు రెవెన్యూ అధికారుల పేరిట సృష్టించిన 13(సీ) నమూన ధ్రువీకరణపత్రంలో నమోదు చేశారు. బాధితుడి ఫిర్యాదుకు, పట్టేదారు పాసుపుస్తకం జారీచేసిన సమయం, 13(సీ)లో నమోదు చేసిన ట్రెజరీ పైకం జమకట్టిన తేదీ 2011 డిసెంబర్ 25. కానీ 13(సీ)జారీ చేసిన సమయం డిసెంబర్ 10 ఉండడంతో నకిలీ పత్రాలుగా స్పష్టమవుతున్నాయి.
పోలీసులు విచారణ చేస్తే ముఠా గుట్టు రట్టు
డబ్బులు తీసుకుని బుకాయిస్తున్నాడని ఫిర్యాదు చేసిన బాధితుడితోపాటు డబ్బులు తీసుకున్న ఇద్దరిని పోలీసులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడితే అసలు విషయాలు బయట పడతాయని చర్చ సాగుతోంది. తిమ్మాపూర్ శివారులోని బొజ్జ మల్లయ్య పేరిట ప్రభుత్వ పరంపోగు రెండు ఎకరాల భూమి నకిలీపత్రాలతో చదును చేసేందకు వెళ్లారు. అయితే అక్కడ గతంలో నుంచి సాగు చేసుకుంటున్న వారు అడ్డుకున్నారు. దీంతో బొల్లు శ్రీనివాస్ ఎన్గల్‌కు చెందిన గుంటి మల్లేశంతో డబ్బులు తిరిగివ్వాలని పట్టుబడుతున్నాడు. అయితే వీరి పేరిట తెచ్చిన పాత పట్టేదారు పుస్తకాలు ఎక్కడివి? 13(సీ) నమూన ధ్రువీకరణపత్రాలు ఎక్కడ సృష్టించారు? తహసీల్దార్ సంతకాలు ఫోర్జరీ చేశారా? వాటిపై స్టాంపులు ఎక్కడివి అన్న కోణంతో విచారణ జరిపితే ముఠా గుట్టరట్టు కానుందని స్థానికంగా చర్చ సాగుతోంది.
తప్పడు పత్రాలతో పట్టాలు ఇచ్చిన తహసీల్దార్లపై కేసులు
గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన సమయంలో తప్పుడు పత్రాలతో పట్టాలు జారీ చేసిన చందుర్తి తహసీల్దర్లు ముగ్గురిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా ఇందులో ఓ డిప్యూటీ తహసీల్దార్, వీఆర్వోలు సైతం ఉన్నారు. అయినా ఇంకా భయం లేకుండా కొందరు అక్రమార్కులు డబ్బులకు ఆశపడి తప్పులు చేస్తూనే ఉన్నారని చెప్పడానికి ఇటీవల లభించిన పాత పట్టేదారు పుస్తకాలు నిదర్శనం. చందుర్తి మండలం మల్యాల, ఎన్గల్ గ్రామాల్లో నకిలీ పత్రాల సృస్టించే ముఠా సభ్యులు ఉన్నారని ప్రచారంలో ఉంది. గతంలో రెవెన్యూ అధికారులు ప్రొసీడింగ్ పత్రాలు ఇవ్వకపోవడంతో బ్యాంకు రుణాలకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ప్రొసీడింగ్ కాగితాలకు దరఖాస్తు చేసుకున్నా అందుబాటులో లేవన్న సమాధానం వస్తున్నట్లు అన్నదాతలు వాపోతున్నారు.
పోలీసులకు సహకరించని రెవెన్యూ అధికారులు
భూములు దున్నుకోనివ్వకుండా రైతులు అడ్డుకుంటున్న సంఘటనల్లో విచారణకు వెళ్తున్న పోలీసులకు రెవెన్యూ అధికారులు సహకరించడం లేదని సమాచారం. ఫిర్యాదుకు సంబంధించి ఏదైనా సమాచారం అడిగితే రెవెన్యూ అధికారుల నుంచి సరైన సమాధానం రావడం లేదని విశ్వసనీయంగా తెలిసింది. ఏమైనా సమస్యలు ఉంటే రైతులు కోర్టులో చూసుకుంటారని చెబుతున్నట్లు తెలిసింది.
బాధితుడు శ్రీనివాస్ పోలీసులకు చేసిన ఫిర్యాదు ఆన్‌లైన్ కాపీ
ఆశిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన బొజ్జ మల్లయ్య పేరిట సృష్టించిన 13 సీ పత్రం
పాత పుస్తకాలతో నయా దందా
బయటపడ్డ నకిలీముఠా లీలలు
ఒక్కోటి వెలుగుచూస్తున్న అక్రమాలు
ఇప్పటికే రెవెన్యూ అధికారులపై కేసులు
అయినా ఆగని అక్రమ దందా
ఆశిరెడ్డిపల్లెకు చెందిన బొల్లు శ్రీనివాస్ ఫిర్యాదుతో ఎన్గల్‌కు చెందిన గుంటి మల్లేశంపై కేసు నమోదు చేశాం. ఇతర పనుల కారణంతో పూర్తి స్థాయిలో విచారణను ఇంకా మొదలు పెట్టలేదు. రెండు రోజుల్లో విచారణను పూర్తి చేసి వివరాలు వెల్లడిస్తాం. మరికొన్ని కేసుల్లో రెవెన్యూ అధికారులను వివరాలు అడిగితే ఫైల్స్ అందుబాటులో లేవని చెబుతున్నారు.
– రమేశ్, ఎస్సై, చందుర్తి
రైతుల భూముల విషయంలో వస్తున్న సమస్యలతో పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కానీ పోలీసులు అడిగే వివరాలను వారికిచ్చే అవసరం లేదు. సివిల్ కేసులైనా, క్రిమినల్ కేసులైనా కోర్టులో ఉంటే కేసులు వేసుకున్న రైతులు ఇద్దరు తహసీల్దార్‌కు అర్జీలు పెట్టుకుంటారు. ఆ అర్జీల ఆధారంగా ఫైల్స్ కార్యాలయంలో అందుబాటులో ఉంటే ఇస్తాం. లేకుంటే లేవనే చెబుతాం. వాటి ఆధారంగా కోర్టులు తీర్పులు ఇస్తాయి. – భూపతి, తహసీల్దార్, చందుర్తి


