ఊరూరా ఉప్పు అమ్మి.. ఉజ్వల భవితనిచ్చి | - | Sakshi
Sakshi News home page

ఊరూరా ఉప్పు అమ్మి.. ఉజ్వల భవితనిచ్చి

Mar 8 2026 7:31 AM | Updated on Mar 8 2026 7:31 AM

ఊరూరా ఉప్పు అమ్మి.. ఉజ్వల భవితనిచ్చి ● కూలీ పనులతోనే నలుగురు పిల్లలను చదివించిన మంగవ్వ

వీర్నపల్లి(సిరిసిల్ల): ఆమె చదువుకోలేదు. కానీ చదువు విలువ తెలుసు. ఆమెకు ఆస్తులు లేకున్నా పిల్లలే తన ఆస్తి అనుకుంది. ఉప్పు తట్ట మోసింది. ఎడ్ల బండిపై ఊరూరా తిరుగుతూ ఉప్పు అమ్మింది. భర్త దూరదేశం వెళ్లినా అధైర్యపడలేదు. కూరగాయలు అమ్మి బిడ్డలు సమాజంలో ఉన్నతస్థానాల్లో నిలబెట్టింది రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని భావుసింగ్‌నాయక్‌ తండాకు చెందిన బట్టు మంగవ్వ.

నలుగురు సంతానం

మంగవ్వ– హరిచంద్‌ దంపతులకు నలుగురు సంతానం. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో హరిచంద్‌ గల్ఫ్‌దేశాలకు వెళ్లాడు. కుటుంబ భారం మంగవ్వపైనే పడింది. తాను గంజినీళ్లు తాగినా పిల్లలకు మంచి చదువు చెప్పించింది. పెద్ద కొడుకు బట్టు విజయ్‌కుమార్‌ ఎంఏ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్‌ అందుకున్నాడు. నిర్మల్‌లోని మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా చేరి, ఆరు నెలల్లోనే అక్కడే ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహించాడు. కూతురు సుజాత తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో మ్యూజిక్‌లో (ఎం.ఏ) పూర్తి చేసి, మణుగూరు ఏకలవ్య పాఠశాలలో సంగీత ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. మరో కొడుకు రాజేష్‌ ఎన్‌ఏసీలో ల్యాండ్‌ సర్వేయర్‌గా శిక్షణ పొంది, కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సర్వేయర్‌గా సేవలందిస్తున్నారు. చిన్న కుమార్తె సరిత ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఒకప్పుడు ఉప్పు అమ్మితే కానీ పూట గడవని స్థితి నుంచి నేడు నలుగురు పిల్లలు ఉన్నత ఉద్యోగాల్లో ఉండటం చూసి తండావాసులు మంగవ్వను అభినందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement