కరీంనగర్‌రూరల్: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచే పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని 318 గ్రామపంచాయతీలకు రూ.12.92కోట్లు మంజూరయ్యాయి. చిన్న పంచాయతీలకు రూ.3లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.10లక్షలు కేటాయించారు. పంచాయతీలకు నిధులు వచ్చాయనే సంతోషపడుతున్న సర్పంచులకు తీర్చాల్సిన అప్పులు సైతం అంతకుమించి ఉండటంతో ఆందోళన కలిగిస్తోంది. ఈ నిధులను పాలకవర్గాలు లేనప్పుడు పంచాయ తీ కార్యదర్శులు ట్రాక్టర్ల నిర్వహణ, పారిశుధ్య, ఇతర పనులకు చేసిన ఖర్చులకు సర్దుబాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
పంచాయతీలపై కార్మికుల వేతనాల భారం
కేంద్ర నిధుల నుంచి పంచాయతీ కార్మికులకు నెల వేతనం రూ.9,500 చెల్లించాలంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. జిల్లాలోని 318 గ్రామపంచాయతీల పరిధిలో మొత్తం 1,297 మంది మల్టీపర్పస్ కార్మికులు పనిచేస్తున్నారు. గతేడాది డిసెంబరు నెల నుంచి పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించనున్నారు.
నిబంధనల ప్రకారం నిధుల వినియోగం
కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను టైడ్, అన్‌టైడ్ పేరిట విడుదల చేస్తోంది. టైడ్ నిధులు తాగునీరు, పైపులైన్ల మరమ్మతు, క్లోరినేషన్, బోరుమోటార్ల నిర్వహణ, పారిశుధ్యం పనులకు వినియోగించాల్సి ఉంటుంది. అన్‌టైడ్ నిధులు పంచాయతీ అభివృద్ధి పనులకు ఉపయోగించుకోవాలి. ప్రస్తుతం జమైన నిధుల నుంచే పాత బకాయిలను సర్దుబాటు చేయాలని మాజీ సర్పంచులు, కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం నిధులను వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు పంచాయతీ అధికారులు పేర్కొంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


