కరీంనగర్ అర్బన్: పశ్చిమాసియాలో యుద్ధం.. వంటగ్యాస్‌పై ప్రభావం చూపుతోంది. ఇన్నాళ్లు గ్యాస్ బుక్ చేసిన రెండు రోజుల్లోనే సిలిండర్ సరఫరా కాగా, కొద్ది రోజులుగా జాప్యం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని చమురు సంస్థలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి వంటగ్యాస్ ధరలు పెంచిన విషయం విదితమే. మరోవైపు వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సరఫరాను నిలిపేశాయి. ఫలితంగా ఆహార పదార్థాల ధరలు పెరుగుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. సరఫరా సక్రమంగా లేక ఏజెన్సీల వద్ద గ్యాస్ నిల్వలు తరిగిపోతున్నాయి. తాజాగా వాణిజ్య సిలిండర్ల విక్రయాలను పూర్తిగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏజెన్సీలు కోత పెట్టినట్లు సమాచారం. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, పారిశ్రామిక అవసరాలకు గ్యాస్ కొరత ఏర్పడనుంది.
వాణిజ్య సిలిండర్లపై ఆంక్షలు
జిల్లాలో పట్టణాల నుంచి పల్లెల వరకు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, టీ స్టాళ్లు, దాబాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద వారం రోజులకు మాత్రమే సరిపోయే పరిస్థితి ఉన్నట్లు సమాచారం. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వారం తర్వాత గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడితే రెస్టారెంట్ల నుంచి చిన్న హోటళ్ల వరకు మూతపడే ప్రమాదముంది. గృహావసరాలు, ఆసుపత్రులు, ప్రభుత్వ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అన్నదాన సత్రాలు, విశ్వవిద్యాలయాలు, అత్యవసర సేవలకు మాత్రమే ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేయాలని గ్యాస్ డిస్ట్రిబ్యూటరీ సంఘం నుంచి ప్రకటన వెలువడటంతో జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. జిల్లాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు 1,500కి పైగా ఉన్నాయి. కొన్ని పెద్ద హోటళ్ల నిర్వాహకులు నేరుగా గ్యాస్ కంపెనీల నుంచే రోజూ ఆర్డర్లపై కమర్షియల్ సిలిండర్లు తెప్పిస్తుంటారు. నిల్వలు రెండు, మూడు రోజులకు సరిపోతాయని అంచనా. ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యి, వరిపొట్టు (ఊక), హైఓల్టేజీ విద్యుత్ పొయ్యిలు ఏర్పాటు చేయక తప్పదు. కొన్ని చిన్న హోటళ్లలో ఇప్పటికే కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటిపై వంట చేసే మాస్టర్స్ (చెఫ్స్) లభ్యత తక్కువగా ఉండటం సమస్యగా మారింది.
జిల్లాలో గ్యాస్ వివరాలు
డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు: 3,50,000
పెరిగిన ధరతో నెలకు భారం: రూ.2.10కోట్లు
కమర్షియల్ కనెక్షన్లు: 80,000
పెరిగిన ధరతో నెలకు భారం: రూ.91.20లక్షలు
వినియోగదారులూ పొదుపే మార్గం
గ్యాస్ బుకింగ్, సరఫరాకు సంబంధించిన వెబ్‌సైట్లు శుక్రవారం అర్ధరాత్రి నుంచి డీలర్ల పరిధి నుంచి చమురు సంస్థల అజమాయిషీలోకి వెళ్లిపోయాయి. గృహ వినియోగదారులు సిలిండర్ బుక్ చేసేందుకు గడువును 21 నుంచి 25 రోజులకు పెంచారు. ఈ వ్యత్యాసం రానున్న రోజుల్లో 30 నుంచి 35 రోజులకు పెరిగే అవకాశముందని డీలర్ల అంచనా. బుక్ అయిన తర్వాత డెలివరీ చేసేందుకు వారం, పది రోజులు పట్టొచ్చు. ఈ లెక్కన గ్యాస్‌ను పొదుపుగా వాడాలి లేదా కట్టెల పొయ్యి, విద్యుత్తు స్టౌవ్‌లు వినియోగించాలి. లేకుంటే గ్యాస్ కొరత ఏర్పడి కటకట తప్పదని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటరీల సంఘం హెచ్చరిస్తోంది. దీంతో గృహ వినియోగదారులు పొదుపు పాటించి నెల రోజులు వాడాల్సిన సిలిండర్‌ను 45 నుంచి 50 రోజుల వరకు వాడుకోవటం మంచిది.
జిల్లాపై రూ.3కోట్ల భారం
ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా యుద్ధంతో జిల్లాపై రూ.3కోట్ల భారం పడింది. ఇప్పటివరకు గృహ వినియోగానికి 14.2కిలోల సిలిండర్ రూ.925 ఉండగా రూ.60 పెంపుతో రూ.985కు చేరింది. 19కిలోల కమర్షియల్ సిలిండర్ రూ.2,026 ఉండగా పెరిగిన ధరతో రూ.2,140కి చేరుకుంది. పెరిగిన ధరలు సామాన్య ప్రజలతో పాటు చిరు వ్యాపారులకూ భారంగా మారనున్నాయి.


