కరీంనగర్‌స్పోర్ట్స్: ప్రతిభకు పట్టం, క్రీడాకారులకు సదుపాయాలు కల్పించడమే ఖేలో ఇండియా లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో మూడు రోజులుగా జరుగుతున్న పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. విజేతలకు బండి సంజయ్ బహుమతులు అందించారు. అనంతరం మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడలు అవసరం అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏటా ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ నిర్వహిస్తున్నారని తెలిపారు.
హెచ్‌సీఏలో పైరవీలు, పైసలే..
తెలంగాణలో ప్రతిభ ఉన్నా చాలా మంది క్రీడల్లో రాణించలేకపోతున్నారని, అందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిదర్శనమని, హెచ్‌సీఏలో ఎంపిక కావాలంటే పైరవీలు, డబ్బులు ముట్ట చెప్పాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. ఇలాంటి వ్యవహారానికి చరమగీతం పాడాలని సూచించారు. క్రీడాకారుల ప్రతిభను దెబ్బతీసే దుర్మార్గానికి స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిభ ఉండి క్రీడల్లో రాణించే పరిస్థితి నేడు రాష్ట్రంలో లేకపోవడం బాధాకరమన్నారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు, గుజ్జ శ్రీనివాస్, మాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు.


